పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే పార్టీలు, అభ్యర్థులకు ప్రజల విజ్ఞప్తి |
1. 'ఆరోగ్య
హక్కు చట్టం' రూపొందించాలి : ఆరోగ్య
సేవలను పొందే హక్కును ప్రాధమిక హక్కుగా గుర్తిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
చట్టాలను రూపొందించాలి.
2. ప్రజారోగ్యానికి
నిధుల కేటాయింపు పెంచాలి : 2017 జాతీయ ఆరోగ్య విధానంలో ప్రకటించినట్లుగా
ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు చేసే వ్యయాన్ని స్థూల జాతీయ
ఉత్పత్తిలో 3.5 శాతానికి పెంచాలి. ఐదేళ్ళలో
దీనిని 5 శాతానికి పెంచాలి. ఆ మేరకు ప్రతి ఏటా కేంద్రం, రాష్ట్ర బడ్జెట్లలో
ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపును గణనీయంగా పెంచాలి. అంకెల
గారడీలు, కంటి తడుపు పెంపుదలలు చేసి, మేమే ప్రజలను
ఉద్దరిస్తామనే ప్రస్తుత ధోరణిని నేతలు విడనాడాలి.
3. ప్రభుత్వ
ఆసుపత్రులను బలోపేతం చేయాలి : మారుమూల
గ్రామాలనుంచి రాజధాని వరకు, ప్రాదమికస్థాయి నుంచి తృతీయ స్థాయి వరకు అన్ని
ప్రభుత్వం ఆసుపత్రులను బలోపేతం చెయ్యడానికి తక్షణ, దీర్ఘకాలిక
ప్రణాళికలు రూపొందించి అమలు చెయ్యాలి. భారత ప్రజారోగ్య
ప్రమాణాల మేరకు అన్ని అసుపత్రులలో వైద్యులను, సిబ్బందిని
నియమించాలి. వైద్య పరికరాలు, వసతులు సమకూర్చాలి, సిబ్బంది నియామకాలు, పరికరాల కొనుగోలు, మరమ్మత్తులు
సకాలంలో, పారదర్శకంగా జరిగేలా తగిన వ్యవస్థాగత ఏర్పాట్లు చెయ్యాలి.
ప్రభుత్వ ఆసుపత్రులలో లభించే వైద్య సేవలను గణనీయంగా పెంచాలి.
ప్రాధమిక, ద్వితీయ స్థాయి ఆసుపత్రులను బలోపేతం చేసి సేవలు మెరుగుపరచడం
ద్వారా తృతీయ స్థాయి ఆసుపత్రులపై అనవసర భారం తగ్గించాలి. ప్రభుత్వ వైద్యులకు
ఆకర్షణీయమైన వేతనాలు, ఇతర ప్రయోజనాలను కల్పించాలి. నాన్
ప్రాక్టీసింగ్ అలవెన్సులను పునరుద్ధరించి ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు
ప్రాక్టీస్ చేయడాన్ని పూర్తిగా నిషేధించాలి. వైద్య ఆరోగ్య శాఖలోనూ, ప్రభుత్వ ఆసుపత్రులలోనూ
విచ్చలవిడిగా పాతుకుపోయిన అవినీతిని సామర్థ్యం, జవాబుదారీతనం, పారదర్శక పెరిగేలా
సమగ్రమైన సంస్కరణలు చేపట్టాలి. రోగులకు సమగ్రమైన
మరియు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందించాలి. వారి
హక్కులకు, ఆత్మగౌరవానికి భంగం కలుగకుండా చూడాలి. ఆసుపత్రి
అభివృద్ధి కమిటీలను రాజకీయ పునరావా కేంద్రాలుగా తయారు చెయ్యకుండా నిజమైన ప్రజా భాగస్వామ్యాన్ని
ప్రోత్సహించేలా నిబంధనలు రూపొందించాలి.
4. పి.పి.పి.లను
హేతుబద్ధం చెయ్యాలి:ఇన్సూరెన్స్ ప్యాకేజీలు కాదు, 'సార్వత్రిక ఆరోగ్య రక్షణ' కావాలి: ప్రభుత్వ
ప్రైవేట్ భాగస్వామ్యం (పి.పి.పి.) పేరుతో గత ఐదేళ్ళ కాలంలో కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య రంగంలో విచ్చలవిడిగా ప్రైవేటు, కార్పొరేట్
సంస్థలను ప్రోత్సహించాయి. ఈ పి.పి.పి.లు
వైద్య ఆరోగ్య సేవలను
మెరుగుపరచకపోగా ప్రజారోగ్యానికి కేటాయించే కొద్దిపాటి నిధులను కూడా
కార్పొరేట్ సంస్థలనకు కట్టబెట్టడానికే ఉపయోగపడ్డాయని అనేక అధ్యయనాలు
స్పష్టంగా వెల్లడించాయి. ఆసుపత్రులలో అందుబాటులో లేని నూతన
సాంకేతిక పరిజ్ఞానం, అత్యవసర చికిత్సలు అందించడానికి మాత్రమే ఈ పి.పి.పి.లను
పరిమితం చేయాలి. బోధనాసుపత్రులలో
అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే విధంగా డాక్టర్లు, సిబ్బంది, మౌళిక సదుపాయాలు
కల్పించి అభివృద్ధి చేయాలి. కార్పోరేట్ల చేతిలో వున్న 102, 104, 108 వాహనాలను, అర్బన్ హెల్త్
సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, రక్త పరీక్షల
కేంద్రాలను ప్రభుత్వమే నడపాలి. ఇన్సూరెన్సు పథకాల వలన ప్రజలకు వైద్య సేవలను అందించడంలో
తగిన ఫలితాలు రాకపోగా, ప్రభుత్వ నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతున్నాయని, నిధులు దండుకోడానికి
కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు
గర్భసంచి తొలగింపు వంటి అవసరం లేని చికిత్సలు, ఆపరేషన్లు చేసాయని
అనేక అధ్యయనాలు సృష్టంగా వెల్లడించినప్పటికీ, ప్రభుత్వాలు గుడ్డిగా ఈ పధకాలను అమలు
చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే తరహా పధకాన్ని 'ప్రధాన మంత్రి
జనారోగ్య అభియాన్' పేరుతో దేశమంతటా
ప్రారంభించారు. పెద్ద ఎత్తున ప్రచారమైతే చేసుకున్నారు కానీ ఈ
పథకం అమలు చెయ్యడానికి అదనపు నిధులు కేటాయించకుండా నేషనల్ హెల్త్
మిషన్ నిధులనే దీనికి మళ్ళించారు. ఈ రకంగా ప్రభుత్వ
ఆసుపత్రులకు అందుతున్న కొద్దిపాటి నిధులు కూడా
ప్రైవేట్ ఆసుపత్రులకు కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. మన
పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాలు ప్రజలందరికీ అన్ని
రకాల వైద్య సేవలను ఉచితంగా అందించే 'సార్వత్రిక ఆరోగ్య రక్షణ' వ్వవస్థ దిశగా
పయనిస్తుంటే మన దేశంలో మాత్రం కొన్ని వర్గాల ప్రజలకు, కొన్ని ఎంపిక
చేసిన చికిత్సలను మాత్రమే అందించే ఇన్సూరెన్సు పథకాలను అమలు చేస్తూ అదే మహా ఘనకార్యమన్నట్లు ప్రచారం
చేస్తున్నారు. మన దేశంలో కూడా 'సార్వత్రిక ఆరోగ్య రక్షణ వ్యవస్థను
రూపొందించాలి.
5. కార్పొరేట్ ఆసుపత్రుల నియంత్రణ, రోగుల హక్కులకు రక్షణ
: ప్రైవేట్, కార్పొరేట్
ఆసుపత్రులపై తగిన నియంత్రణను అమలు చేయడానికి, అదే సమయంలో చిన్న
మధ్య స్థాయి ప్రైవేట్ ఆసుపత్రులకు రక్షణ కల్పించడానికి క్లినికల్
ఎస్టాబ్లిష్మంట్స్ చట్టానికి తగిన సవరణలు చేయాలి. ఫీజులు వైద్య పరీక్షల పేరుతో
దోపిడీకి గురికాకుండా, నాణ్యమైన వైద్య
సేవలు పొందేలా రోగుల హక్కులకు రక్షణ
కల్పించడానికి నిబంధనలను రూపొందించాలి.
6. ఔషధ రంగంలో
జరుగుతున్న దోపిడీని
అరికట్టాలి: అత్యవసర, నిత్యావసర మందులు
ప్రజలకు అందుబాటు ధరలలో లభించేలా చర్యలు తీసుకోవాలి. వాటి నాణ్యతా ప్రమాణాలను
పర్యవేక్షించడానికి ఔషధ నియంత్రణ విభాగాన్ని బలోపేతం చెయ్యాలి. అవకతవకలకు పాల్పడే
ఔషధ తయారీ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అనవసర ఔషధాలను, హానికరమైన
కాంబినేషన్లను నిషేధించాలి. తయారీ వ్యయం ఆధారంగా ఔషధాల ధరలను
నిర్ణయించాలి. ప్రభుత్వ రంగ ఔషధ మరియు వ్యాక్సిన్ పరిశ్రమలను పునరుద్ధరించాలి.
7. అందరికీ నాణ్యమైన
మందులు ఉచితంగా ఇవ్వాలి : ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులందరికి
నాణ్యమైన అన్ని మందులను ఉచితంగా ఇవ్వాలి.
8. జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయాలి: ప్రజల
ప్రయోజనార్ధం ప్రతి మండల కేంద్రంలో జనరిక్ మందుల షాపులు ఉండే విధంగా
ప్రభుత్వం కృషి చేయాలి. ఇందుకు అవసరమైన ప్రోత్సాహకాలు
అందించాలి. ఇవి పేద,
మధ్య తరగతి ప్రజల వైద్య ఖర్చులు తగ్గించుకునేందుకు ఎంతో ఉపకరిస్తాయి.
వైద్యులందరూ జనరిక్ మందులనే సూచించాలనే
నిబంధనను కట్టుదిట్టంగా అమలు జరపాలి.
9. వైద్య ఆరోగ్య
సిబ్బంది హక్కులకు రక్షణ కల్పించాలి : ఏదైనా ప్రైవేటు యాజమాన్యం తన ఉద్యోగుల హక్కులను
హరిస్తుంటే ప్రభుత్వానికి మొరపెట్టుకుంటారు. కానీ స్వయంగా
ప్రభుత్వమే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది హక్కులను
హరిస్తుంది. ఏ వ్వవస్థ సక్రమంగా పనిచేయాలన్నా సిబ్బంది కీలక
పాత్ర పోషిస్తారు. వారికి సామర్థ్యాలకు, సౌకర్యాలు, వేతనాలు, ప్రోత్సాహకాలు అందించి
సానుకూల పని పరిస్థితులు కల్పించాలి. కానీ దీనికి
భిన్నంగా మన రాష్ట్రంలో సగానికి పైగా వైద్య ఆరోగ్య సిబ్బంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్
పేరుతో శ్రమ దోపిడికి
గురౌతున్నారు. నూతన ప్రభుత్వం ఈ విధానాన్ని విడనాడాలి. అన్ని పోస్టులకు రెగ్యులర్
ప్రాతిపదికన భర్తీ చెయ్యాలి. సమాన పనికి సమనా వేతనం ఇవ్వాలనే సుప్రీం
తీర్పును అమలు చెయ్యాలి. అంగన్వాడీ, అషా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా
గుర్తించి న్యాయమైన వేతనాలను అందించాలి.
10 మద్య నియంత్రణ
అమలు చేయాలి: నూతన ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదు. ప్రజారోగ్యం మీద, కుటుంబాల మీద, యువత భవిష్యత్తు
మీద,
శాంతి భద్రతల మీద మద్యపానం యొక్క
ప్రభావాన్ని గుర్తించాలి. మద్య నియంత్రణను పటిష్టంగా అమలు చేయాలి.
11. మందులు, వైద్య పరికరాలపై
జి.ఎస్.టి.ని ఎత్తి వేయాలి: ప్రసుత్తం రోగులకు అయ్యే ఖర్చులో
అత్యధిక భాగం మందుల కొనుగోలుకే అవుతుంది. దీని వలన కోట్ల మంది రోగులు
పేదరికంలోకి నెట్టబడుతున్నారని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. కావున ప్రజల ప్రాణాలు కాపాడే
మందులు,
వైద్య పరికరాలపై ప్రస్తుతం విధిస్తున్న 12 శాతం జి.ఎస్.టి.ని
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించాలి.
12. గిరిజన కొండ
ప్రాంతాల ప్రజల ప్రాణాలను కాపాడాలి. కిడ్నీ వ్యాధులు,మలేరియా, పైలేరియా, డెంగ్యూ, చికున్ గుప్ట్య
వంటి వ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు కొండ మరియు గిరిజన
ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక
ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి.
13.
వైద్య పరిశోధనలను ప్రోత్సహించాలి: రాష్ట్రంలో వైద్య
పరిశోధన సంస్థలను ఏర్పాటు చేసి, వైద్య పరిశోధనలు చేయాలి. మన
రాష్ట్ర ప్రజల ఆరోగ్యావసరాలను తీర్చే విధంగా కాళోజి హెల్త్ యూనివర్సిటీ
ఆధ్వర్యంలో వైద్య పరిశోధనలు రూపొందించాలి.
14. వైద్య విద్యలో
సంస్కరణలు: వైద్య విద్యకు ప్రభుత్వం నిధుల కేటాయింపును
పెంచాలి. కొత్త మెడికల్, డెంటల్, నర్సింగ్, ఇతర పారా మెడికల్
కళాశాలలకు అనుమతులు ఇవ్వడానికి ప్రజల అవసరాలే ప్రాతిపదికగా
ఉండాలి. ప్రభుత్వ కళాశాలలకు తగిన నిధులు కేటాయించి సిబ్బంది పరికరాలు, సౌకర్యాలు సమకూర్చాలి.
ప్రైవేట్ కాలేజీలలో ఫీజులు, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో
పారద్శక విధానాలను రూపొందించాలి. విద్యార్థులకు అవసరమైన, మానసిక ఒత్తిడి
కలిగించని, వారిలో నైతిక విలువలు, సామాజిక స్పృహ, అత్యున్నత
నైపుణ్యాలు పెంపొందించే ప్రజాస్వామిక శిక్షణా విధానాలను
రూపొందించాలి. ప్రమాణాలు పాటించని, విద్యా
వ్యాపారానికి పాల్పడే ప్రైవేట్ కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
అవసరమైతే అటువంటి కళాశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్
ఇండియా,
డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి
సంస్థలలో పేరుకుపోయిన అవినీతి, ఆశ్రిత పక్షపాత
ధోరణులను రూపుమాపాలి. అదే సమయంలో ఆయా సంస్థలు
ప్రజాస్వామికంగా కొనసాగే అవకాశం కల్పించాలి
15.
వ్యాధి నివారణ, ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: దోమలు, ఇతర కీటకాల ద్వారా
వ్యాపించే జ్వరాలు, ఇతర జబ్బుల నుంచి ప్రజలను కాపాడాలి.
'దోమలపై దండయాత్ర' వంటి ప్రచార
ఆర్భాటాలకు పరిమితం కాకుండా చిత్తశుద్ధితో కార్యాచరణ చేపట్టాలి. రక్త హీనత తదితర పోషకాహారలోపాల
నుంచి మహిళలను, చిన్న పిల్లలను కాపాడాలి. దీనికోసం అంగన్ వాడి
కేంద్రాలను, మద్యాహ్న భోజన పథకాలను బలోపేతం చెయ్యాలి. మాతృమరణాలు, శిశు మరణాలు
అరికట్టాలి.
16. ప్రజల
భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి:: ప్రజలను కేవలం
లబ్ధిదారులుగా పరిగణించే పెత్తందారీ వైఖరిని విడనాడాలి. ఆరోగ్య ప్రణాళికల
రూపకల్పనలో, వ్యవస్థల నిర్వహణలో, పర్యవేక్షణలో
ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. 'గ్రామ ఆరోగ్య, పోషకాహార, పారిశుద్ధ్య
కమిటీలు' మన రాష్ట్రంలో కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ కమిటీలను
క్రియాశీలంగా పని చేయించాలి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు, జిల్లా ఆరోగ్య సమాఖ్యలను
ప్రజాస్వామిక స్పూర్తితో నిర్వహించాలి. నేడు ప్రభుత్వ
ఆసుపత్రులు, ఆరోగ్య వ్యవస్థలలో
నెలకొన్న ఎన్నో సమస్యలకు ప్రజల భాగస్వామ్యం అద్భుతమైన పరిష్కారాలను చూపగలదు. తమ ఎన్నికల ప్రణాళికలలో ఈ
అంశాలను చర్చించవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలకు ప్రజలందరి తరపున
జన విజ్ఞాన వేదిక విజ్ఞప్తి చేస్తున్నది. తమ ఎన్నికల ప్రసంగాలలో ఈ
అంశాలను చర్చించవలసిందిగా నాయకులకు, అభ్యర్థులకు మా మనవి. మన వద్దకు ఓట్లు
అడగటానికి వచ్చే నేతలను ఈ అంశాలపై మనమందరమూ ప్రశ్నిద్దాం. ఈ ప్రజా ఆరోగ్య
ప్రణాళికను విస్తీతంగా ప్రజలలోనికి తీసుకు వెళ్ళవలసిందిగా సామాజిక సంస్థలకు, ప్రజా సంఘాలకు, పౌర సమాజ సంస్థలకు, ప్రజాస్వామిక
వాదులకు మా సగౌరవ విన్నపం.
“అందరికీ ఆరోగ్యం
సాధ్యమే - అందుకు మార్గం ప్రజారోగ్య ఉద్యమమే"