ప్రశ్న : చూస్తేనే దేవుడ్ని నమ్ముతామని
మీరంటున్నారు కదా ! గాలిని కూడా జనం చూడటంలేదు. మరి గాలి లేదని అనలేం కదా ! దేవుడే
లేకుంటే ఆదిమ మానవుడు ఎలా పుట్టాడు ?
జవాబు : చూస్తేనే మేము నమ్ముతామని, దేవుడ్ని మీరెవరూ నమ్మొద్దని నేను గానీ, జనవిజ్ఞాన వేదిక నాయకులు ఎవరు గానీ
ప్రబోధించలేదు. అలా ప్రబోధించరు కూడా.
ప్రతిదాన్నీ ప్రశ్నించమని, సమాధానాల్ని శాస్త్రీయంగా రాబట్టుకుంటూ, సైంటిఫిక్ ఎవిడెన్స్ తోనే నమ్మకాల్ని
గానీ, భావాల్ని - విశ్వాసాల్ని గానీ, ఏర్పర్చుకోమనీ దేన్నీ గుడ్డిగా
నమ్మవద్దని మాత్రమే మేము చెబుతాం.
మన భారత రాజ్యాంగంలోనే పౌరుల ప్రథమిక
విధుల్లో ఆ మాట ప్రస్ఫుటంగా చెప్పబడింది.
శాస్త్రీయస్ప్రుహను,[Scientific Temper]
మానవవాదాన్ని,[Humanism]
పరిశీలనా తత్వాన్నీ,[Spirit of Enquiry]
సంస్కరణాభిలాషను [Reforms]
పెంపొందించు కోవడం
ప్రతి భారతీయుడి ప్రాథమిక విధి ! {Fundamental Duty}..
అంటూ రాజ్యాంగంలోని 51 A (h) అధికారణంలో ఉంది.
గాలికి, దేవుడికి పోల్చుతూ ప్రశ్నించారు కాబట్టి ఆ మేరకు మీరు రాజ్యాంగ బద్ధంగా
మీ విధిని చక్కగా నిర్వర్తిస్తున్నట్టే. మన సాధారణ కంటికి కనిపించని గాలితో
పోల్చుతూ.. ఏవిధంగానూ కనిపించని దేవుడి గురించి
శాస్త్రీయ దృక్పథంతో తార్కిక దృష్టితో..
మీరు ప్రశ్నించారు. సంతోషం.
గాలి కనిపించక పోయినా దాని ప్రభావాలు
ఎటు చూసినా, ఎవరు చూసినా కనిపిస్తాయి. గాలికి ఘన
పరిమాణం అనే కొలత ఉంటుంది. అలాగే గాలికి ద్రవ్యరాశి కూడా ఉంటుంది. కాబట్టి
దాంతోపాటే సాంద్రత కూడా ఉంటుంది. గాలికి ఉష్ణోగ్రత ఉంటుంది. అంతే కాదు, గాలిని చూడలేక పోయినా దాని ఉష్ణోగ్రతను
తగ్గిస్తే.. అది ద్రవరూపానికి చేరుకుంటుంది. అప్పుడు అదే గాలిని మనం సులభంగా మన
సాధారణ కంటితో చూడగలం.
మామూలు గాలిలో సుమారు 80శాతం నైట్రోజన్ ఉంటుంది. గది ఉష్ణోగ్రత
దగ్గర ఒక ఖాళీ బెలూన్‌లోకి సుమారు 22 లీటర్ల నైట్రోజన్ ఊదితే ఆ బెలూన్ బరువు కచ్చితంగా 28 గ్రాములు ఉంటుంది.
అదే బెలూనులోకి అంతే ఘన పరిమానం ఉన్న
ఆక్సిజన్‌ని ఉంచితే 32 గ్రాముల బరువు తూగుతుంది. అలాగే అంతే ఘన పరిమాణం గల హైడ్రోజన్‌ని
అందె బెలూన్ లోకి ఊదితే దాని బరుకు కేవలం 2 గ్రాములే తూగుతుంది.
28 గ్రాముల కనిపించని నైట్రోజన్‌ని దట్టమైన గోడలు ఉండే ఒక పాత్రలోకి
పంపి, ఉష్ణోగ్రతను -200్ణ°C తగ్గిస్తే సలసల కాగే నీళ్లలాగా పొగలు చిమ్మే ద్రవ రూప నైట్రోజన్ ను
(నైట్రోజన్ ద్రవాన్ని) మనం చూడగలం.
ఇలా ప్రతి వాయువునూ నిర్దిష్ట , తక్కువ ఉష్ణోగ్రతకు తీసుకెళ్తే అన్ని
వాయువులు ద్రవాల్లాగా గ్లాసులో నీళ్లున్నట్టుగానే కనిపిస్తాయి.
ఆ ద్రవాలు ఉష్ణోగ్రతను ఇంకా తగ్గిస్తే
అవి ఐసు గడ్డలా గట్టిగా, రాయిలా ఘన రూపంలో చూడగలం. మామూలుగా వాయు రూపంలో ఉండి మన సాధారణ
కంటికి కనిపించని గాలిని మన పంచేంద్రియాలతో సరైన పద్ధతిలో ప్రత్యక్షంగా పరిశీలించి
చూడగలమని అర్థమైంది కదా.
ఇంకో విషయం..
ఇలా గాలిని లేదా ఏదేని వాయువును మీరు, నేను, మా పక్క ఇంటి వెంకటేశ్వర రావు, ఎదురింటి రహీం, పక్క వీధిలో ఉండే మేరీ ఎలిజబెత్ మేడం, మా డ్రాయింగ్ మాస్టార్ సీతారామ శాస్త్రి, టిబెట్‌లోని దలైలామా, వాటికన్ సిటీలోని పోప్, స్వర్ణ దేవాలయానికి వెళ్లే రణవీర్
సింగ్.. అలా ఎవరికైనా..
ఏ వాయువునైనా, ఆది మామూలుగా ఉండే గది ఉష్ణోగ్రత నుండి, దాని ఉష్ణోగ్రతను తగ్గించుకుంటూ -200్ణ°Cకి తీసుకెళ్తే ఇక ఆపై అది అందరికీ కనిపిస్తుంది. అంతేగాదు అది అందరికీ ఒకే విధంగా కూడా
కనిపిస్తుంది. వేర్వేరు మతాల వాళ్లకి, వేర్వేరు రంగుల్లో వేర్వేరు రూపాల్లో కనిపించదు. నాస్తికులకు కూడా
కనిపిస్తుంది. వారికి కూడా అందరిలా, అదే విధంగా కనిపిస్తుంది.
కాబట్టి గాలి కనిపించడం లేదనడం కరెక్టు
కాదు. మీరు మామూలు పరిస్థితుల్లో చూస్తే తాగే మంచినీరు కూడా దాన్ని 100్ణ°C దాటే వరకు వేడి చేస్తే మన కంటికి కనిపించదు. దానర్థం ఆ మంచి నీరు
మాయమైనట్టు కాదు కదా. వేడెక్కి కనిపించ కుండా పైకి వెళ్ళిన నీటి ఆవిర్లే, అవి చల్లబడిన వెనువెంటే వర్షాలుగా మారి
తిరిగి భూమిని చేరుతాయి.
మరి కనిపించని ఆ దేవుణ్ణి ఏ ఉష్ణోగ్రత
దగ్గరకు తీసుకెళ్తే కనిపిస్తాడో మీరే చెప్పాలి.
గాలి కనిపించట్లేదు ఎందుకని ఎవరూ మారాం
చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మూర్ఖులు అలా అంటే గాలిని చల్లబర్చి ద్రవ రూపంలో
చూపొచ్చు. ఇలా అందరికీ కనిపిస్తుంది.
ఇలా అందరికీ కనిపించాలంటే.. దేవుడ్ని ఏ
పాత్రల్లో పెట్టాలి ? ఎంత వరకు చల్లబర్చాలి ? పోనీ ఎవరికైనా కనిపించాడా ? ఎలా వున్నాడు ? అతడు మగవాడే అంటూ ఎందుకు అంటుంటారు ? మగవాడేనని ఎలా తెలుసు కున్నారు ?
దెవుడిలా గాలికి లైంగికత లేదు కదా. గాలి
పిల్లల్ని కనదు కదా. అది దేవుడిలాగా ఆభరణాలు ధరించదు కదా. ఆయుధాలు పెట్టుకోదు
కదా. దానికి శత్రువులు ఎవరూ లేరు కదా. అలాగే అది పదే పదే యుగ, యుగాలూ (కొత్త కొత్త అవతారాలతో)
సంభవించదు, ప్రత్యక్షం కాదు. అది తన మానాన తాను
ప్రకృతిలో ఉంటుంది అంతే.
ఈ లెక్కన గాలికి ఉన్నట్టే ప్రత్యేక ధర్మాలు
కూడా దేవుడికి ఉండాలి కదా. కాబట్టి ఉపమానాలు, అలంకారాలు వాడితే ఉపమానాలాంకృతయ్యే వాదనాంశం అసమానపు ఉనికిని పుణికి
పుచ్చుకోలేదు.
వాదన తార్కికంగా ఉన్నట్లయితే.. ఏ
విధంగానైనా మనం వాదించగలం.
అసలు దేవుడితో పోల్చడానికి కనిపించని
గాలిని, పరమాణువును, ఎలక్ట్రానును మాత్రమే ఎందుకు ఉదాహరణలుగా
తీసుకోవాలి ?
కనిపించే కొండలు, మనుషులు, నదులు, దోమలు, గుర్రాలు, గాడిదలు, పందులు, ఆవులు, కప్పలు, చెట్లు, రాళ్లు, గుళ్లు, విగ్రహాలు, చెప్పులు, గులాబీలు, కర్పూరం, పేడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా.
మరి దేవుడు కనిపించ డెందుకని ?
అవి కూడా మీరు ప్రశ్నించుకోలేదా ?
ఏమి చేస్తే కనిపించని ఎలక్ట్రాన్ల
ప్రభావం కనిపిస్తుందో నిర్దిష్ట ప్రక్రియ ఉంది. ఏం చేస్తే కనిపించని పరమాణువులు
కనిపిస్తాయో నిర్దిష్ట విధానాలూ ఉన్నాయి.
ఏం చేస్తే కనిపించని గాలి కనిపిస్తుందో
పైన చెప్పిన కచ్చితమైన పద్ధతులూ ఉన్నాయి. వాటిని ఎవరు చేసినా, ఎక్కడ, ఎప్పుడు చేసినా అవే ఫలితాలు వస్తాయి.
అంతేకాదు అలాంటి పద్ధతులేమిటో నోటికి
వచ్చినట్టు, బుర్రకు తోచినట్టు ఎవరూ ఊహించి
చెప్పలేదు. ప్రవచనాలు చేయలేదు. ఆ పద్ధతులన్నీ ప్రయోగాత్మకంగా రుజువయ్యాయి. పైగా ఆ
పద్ధతులన్నీ పదార్థాలతో చేస్తారు.
మన ముందుంచిన బెలూన్లోని గాలిని, మన సాధారణ కంటితో చూడాలనీ అంటే.. ఆ
గాలి బెలూన్లను వీధిలో వదిలేసి బాత్‌రూమ్‌లకి వెళ్లి కళ్లు మూసుకొని ధ్యానం
చేస్తే.. వీధిలోని బెలూన్లు చల్లబడి ద్రవరూపానికి చేరి మనకు కనిపించవు. మీ
దగ్గరికి వచ్చే గాలిని చూడ్డానికి, మీరు గాలితోనే తలపడాలి.
మరి దేవుడ్ని చూడ్డానికి ఎక్కడ ఎవరితో
తలపడాలి ?
దేవుడే లేకుంటే ఆదిమ మానవుడు ఎలా
పుట్టాడు ? అని కూడా ప్రశ్నించారు. అలా అడగడం
మంచిదే. అదికూడా రాజ్యాంగ స్ఫూర్తి ఇచ్చిన ప్రశ్నించే తత్వం.
అలా 'ప్రశ్న' అడగడంలో న్యాయం ఉంది.
ఐతే దేవుడే ఉంటే.. మరి అతడిని ఎవరు
సృష్టిం చారు ? అని కూడా నేను అదే రాజ్యాంగస్ఫూర్తితో
ప్రశ్నంచగలను.
దేవుడు తనంత తానుగా సృష్టించుకొం టాడని,
అతడికి ఆది - అంతం లేదని ఒకసారి.. ఎపుడూ
ఉంటాడనీ ఒకసారీ.. ఆమాటకొస్తే.. 'ఇందుగలడందు లేడని సందేహము వలదని, ఆయన ఎల్లవేళలా, ఎల్లచోట్లా కలడననీ ఒకసారీ.. ఇలా పరిపరి విధాలుగా అనుకొంటే ఆ
దేవుడనబడే వ్యవస్థకు రూపంలేదని అర్థం.
దేవుడు సర్వత్రా వ్యాపించి ఉన్న ప్రకృతి
లాంటిదని మీరంటే. లేదా ఈ
ప్రకృతే దేవుడైతే లేదా ప్రకృతికే మీరా
పేరు పెడితే, అది మీ ఇష్టం.
అందులోంచే, ఆ ప్రకృతిలోంచే మనిషి పుట్టాడు.
అందులోనే అన్నీ ఉన్నాయి. మా ప్రకృతి వేరు, మీ ప్రకృతివేరు అంటూ తగాదాలు పెట్టు కుంటామా ? మా సూర్యుడు వేరు, మీ సూర్యుడు వేరు అంటూ కక్షలు పెంచు
కుంటామా ? సూర్యుడు అక్కడెక్కడో ఉంటే మా సూరుడు
వెన్న దొంగి లించాడనో, మా మిల్కీవే గెలాక్సీని శిలువ వేశారనో, మా ఆండ్రామిడా గెలాక్సీ ప్రవక్తగా మారిందనో అబద్ధాలు చెప్పం కదా.
మతాలు ఏవైనా అందరూ అందులో భాగమే.
కాబట్టి మన పని మనం శ్రద్ధగా
చేసుకుందాం.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
email:
allikayala@gmail.com