నిజంగానే ...
మంత్రాలకు చింతకాయలు రాలితే ...
తంత్రాలకు సమస్యలన్నీ తీరితే ...
యంత్రాలకు కష్టాలన్నీ కడతేరితే ....
తాయత్తులకు కోరికలన్నీ నెరవేరితే ...
ఉంగరాలకు ఉన్నత స్థితి మారితే ....
చేతబడులకు కోరినవన్నీ జరిగితే ...
మొక్కుబడులకు సిరిసంపదలు సమకూరితే ...
ధూప, దీప నైవేద్యాలకు అనుకున్నవన్నీ అయితే ...
తీర్థ ప్రసాదాలకు ఆయురారోగ్యాలు కలిగితే ...
అభ్యంగ స్నానాలకు, ఆలయాల సందర్శనాలకు ...
అష్టఐశ్వర్యాలు లభిస్తే ...
హోమ, యజ్ఞయాగాదులకు వర్షాలు కురిస్తే ...
ఇక సైన్స్ ఎందుకు ...
శాస్త్రవేత్తలెందుకు ...
నిజంగానే ఈవన్నీ జరిగితే ...
ఇక గుడులను ఇంకా ఇంకా కట్టాల్సిందే …
బడులను ఇక కూల గొట్టాల్సిందే ...
సైన్స్, గణిత గ్రంధాలను కాల్చివేయాల్సిందే ...
పరిశోధనా సంస్థలను పేల్చి వేయాల్సిందే ...
గజకర్ణ, గోకర్ణ టక్కుటమారాలను చేరదీయాల్సిందే ...
ఖగోళ, భూగోళ శాస్త్రాలను పారవేయాల్సిందే ...
క్షుద్ర, తాంత్రిక మంత్రాలయాలను తెరవాల్సిందే ...
వైద్య, విజ్ఞాన విశ్వవిధ్యాలయాలను మూసివేయాల్సిందే ...
మాయల మరాటీలకు ఎదుర్కోలు చెప్పాల్సిందే ...
వైద్యులకు, శాస్త్రవేత్తలకు వీడ్కోలు పలకాల్సిందే ...
జాతక, వాస్తు, జోతిష్యాలను కాలరాయాల్సిందే ...
మల మూత్రాదులను సేవించాల్సిందే ...
మందులను టానిక్కులను విసిరేయాల్సిందే ...
దొంగబాబాల, స్వాముల ఇంద్రజాల మహిమలకు జై కొట్టాల్సిందే ...
శాస్త్రవేత్తల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఛీ కొట్టల్సిందే ...
పూజలు, ప్రార్ధనలు చేయాల్సిందే ...
శస్త్రచికిత్సలను, అంతరిక్ష పరిశోధనలను ఆపివేయాల్సిందే ...
అయితే ...
నిజంగానే ...
సైన్స్ విజ్ఞానమే లేకుంటే రాకుంటే ...
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానమే వినియోగం కాకుంటే ...
ఇంత ఆధునిక మానవ పురోగమనం జరిగేదా? ...
ఇన్ని సకల సౌకర్యాలను పొందేవాళ్ళమా ? ...
అంతరిక్షంలోకి ఎగిరే వాళ్ళమా ?...
ఇంకా ... ఈ కంప్యూటర్ యుగంలో కూడా
మూఢాచారాలు వ్యవహారాలుగా చలామణి అవుతున్నంత కాలం :
పిచ్చి నమ్మకాలు నిత్యకృత్యాలుగా చెలరేగుతున్నంతకాలం :
మూర్ఖత్వం, మూఢత్వం, అజ్ఞానం ఇంకా పెల్లుబుకుతున్నంత కాలం :
ఈ అశేష, విశేష విజ్ఞాన, ప్రజ్ఞాన వెల్లువలను గుర్తించనంత కాలం :
ఈ (ప) దేశానికి గతిలేదు పురోగతి లేనే లేదు…
ఇప్పటికి ఎప్పటికీ సైన్సే శరణం గచ్చామి …
విజ్ఞానమే శరణం గచ్చామి …
విజ్ఞానమే శరణం గచ్చామి …
********************
బాలవర్ధిరాజు
చరవాణి: 8712971999.