ఆధ్యాత్మిక, తాత్విక, ధార్మిక, సాహిత్య, సంగీత కళారంగాలలో మనం ప్రపంచానికి వెలుగు చూపామని వెన్ను
చరుచుకుంటూ వుంటాం. కావచ్చు.. కానీ అదిప్పుడు అసందర్భం. జపాన్ వంటి ఒక చిన్న దేశం
సాధించిన పురోగతి ముందు మనం నిలబడగలుగుతున్నామా? మన సమాజంలో శాస్త్రీయ దృక్పథం గల జనాభా ఎంత? మన ప్రార్థనల్ని, యాగాల్ని, బలుల్ని విమర్శించే ప్రపంచ మేధావులకు మనమివ్వగలిగే సమాధానమేంటి? బ్రిటన్లోని లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబరు లార్డ్ ఫన్నర్
బ్రూనిక్‌లే ఒక ప్రపంచ మహా సభలో అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలను ఉద్దేశించి
బాహాటంగా విమర్శించాడు కదా! 'మీరు ప్రార్థనలు చేస్తూ, పూజలు చేస్తూ, తీర్థయాత్రలకు
తిరుగుతూ, సమాధిలో ఉంటూ కాలాన్ని వృధా
చేస్తూ- మేం చమటోడ్చి తయారు చేసిన మా ఉత్పత్తుల్లో మీకు భాగమిస్తూ ఉండాలని ఎట్లా
కోరుకుంటున్నారయ్యా?' అని సూటిగా ప్రశ్నించినపుడు
మన దగ్గర సమాధానం లేకపోయిందే! దేవుడి ప్రసాదంతో కడుపు నిండిన దాఖలాలు, బాబాల మహిమలతో పంటలు పండిన దాఖలాలు ఇంతవరకు లేవు. ఇక ముందు కూడా
ఉండవు. వ్యవసాయం నుంచి అంతరిక్షం దాకా ఆధునిక జీవితమంతా సైన్స్ పెట్టిన భిక్షే!
ప్రతి సమాజానికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. ఆ ప్రత్యేకత ఆ సమాజం లోని మనుషుల అవగాహనా
స్థాయిని బట్టి, నమ్మకా లను బట్టి, వాళ్లు జీవించే కాలాన్ని బట్టి, ప్రకృతి ధర్మాలను వాళ్లు అన్వయించుకునే తీరును బట్టి వుంటాయి. ఆది
మానవుడికి సూర్యోదయం, సూర్యా స్తమయం అంతుపట్టని
రహస్యాలుగా ఉండేవి. పట్ట పగలు సూర్య గ్రహణం సృష్టించే తాత్కాలిక అంధ కారాన్ని చూసి, ప్రళయం వచ్చిందని బెంబేలు పడే వాడు. ప్రశ్నించడం తెలియని రోజుల్లో
శాస్త్ర విజ్ఞానం వికసించని రోజుల్లో మనిషి తనకు అర్థమయ్యీ, అర్థం కాని రీతిలో కొన్ని జీవితపు విలువల్ని రూపొందించుకున్నాడు.
కాలం గడుస్తున్న కొద్దీ మనిషి తనను తాను చూసుకోవడం మొదలు పెట్టాడు. ప్రకృతిని
అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు. ఉత్సుకత మొదలవడంతో ప్రశ్నించడం మొదలు పెట్టాడు. ఆ
విధంగా ప్రశ్నించడంతోనే విజ్ఞాన శాస్త్ర పురోగమనం జరుగుతూ వస్తోంది. గత రెండు
శతాబ్దాలలో శాస్త్ర సాంకేతిక రంగాలలో అనూహ్యమైన ప్రగతి జరుగుతూ వస్తోందని మనకు
తెలుసు. అంతు తెలియని రహస్యాలుగా భ్రమించిన ఎన్నో విషయాల్ని విజ్ఞాన శాస్త్రం
తేటతెల్లం చేసింది.
ప్రపంచంలోని ఎన్నో ఇతర సమాజాల్లాగానే మన భారతీయ సమాజం కూడా ఎన్నో
నమ్మకాలతో, సంస్కృతీ సాంప్రదాయాలతో
విలసిల్లింది. మనది అతి పురాతన నాగరికత. మన పూర్వీకులు అన్ని రంగాలలో అమోఘమైన
ప్రతిభాపాటవాలు ప్రదర్శించారు. నిజమే! అయితే అందులో కొంత స్వార్థ చింతన చేరింది.
అశాస్త్రీయమైన భావనలు, సిద్ధాంతాలు ఎక్కువగా
రూపుదిద్దుకుంటూ వచ్చాయి. సమాజ పురోగమనాన్ని దారి మళ్లించాయి. మూఢ నమ్మకాలు
విశ్వరూపం దాల్చాయి. కుల వ్యవస్థ సమాజాన్ని ముక్కలు చేసింది. అందువల్ల ప్రపంచ
వైజ్ఞానిక ప్రగతి ఒక దిశలో కొనసాగుతుంటే.. మన భారతీయ సమాజం మరో దిశకు
ప్రయాణించింది. మనం మన సంస్కృతి నాగరికతల గూర్చి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, చాలా విషయాల్లో చాలా వెనకబడి ఉన్నామన్న సంగతి తప్పక ఒప్పుకోవాలి.
రక్త కణ నిర్మాణం, జన్యు సంబంధమైన పరిజ్ఞానం
పెరిగిన తర్వాత కూడా, కులాలు, మతాలు వర్థిల్లుతూ దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలపై బలంగా ప్రభావం చూపుతున్నాయంటే, మొత్తానికి మొత్తంగా సమాజాన్నే ఛిన్నాభిన్నం చేస్తున్నాయంటే -దాని
అర్థం ఏంటి?
'అన్నీ మన వేదాల్లో ఉన్నాయష!' అని పలికే వాళ్లున్నారు. వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు
వేదాల్లో, పురాణాల్లో వైజ్ఞానిక
విషయాలన్నీ రాసి పెట్టారు' అని చెప్పేవాళ్లున్నారు. ఈ
విషయంలో ప్రధాని మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు గొప్ప
ఉదాహరణగా నిలబడతారు. వీళ్లంతా మత మౌఢ్యానికి 'శాస్త్రీయ' వివరణ చూపే మహానుభావులు.
కొన్ని శతాబ్దాల క్రితమే మనకు విమానాలు వున్నాయని-అందులో వాళ్లు ప్రయాణించి వచ్చిన
వాళ్లలాగా-నొక్కి వక్కాణించే వాళ్లున్నారు. ఇలాంటి వారితో సమాజానికి జరిగేది కీడే తప్ప
మేలు కాదు. ఇలాంటి హాని మన సమాజానికి శతాబ్దాలుగా జరుగుతూ వస్తోంది. వేదాల్ని
కూలంకషంగా అధ్యయనం చేసిన వారు చెప్పిన యధార్థమేమిటంటే-వేదాల్లో కనీసం నీటి
విశ్లేషణ కూడా లేదని! హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్‌ల
ప్రసక్తే లేదని! ఆ పేర్లు కాకపోయినా వాటికి సమానార్థలుగా వాడిన ఇతర పేర్లేవీ
లేవని! ఇలాంటి అతి ప్రాథమికమైన రసాయనిక శాస్త్ర వివరణలే లేనప్పుడు ఇక విమానాల
తయారీ ఏముంటుంది? వైజ్ఞానిక స్పృహ లేని వారంతా
అధికారంలోకి వస్తే దేశంలో వితండవాదాలు, మత విద్వేషాలు ఎంతగా చెలరేగుతాయో ప్రత్యక్షంగా చూస్తూనే వున్నాం.
దీనికి సామాన్య పౌరులే అడ్డుకట్ట వేయగలరు.
'చదువు రాని నిరక్షర కుక్షులు మూఢ నమ్మకాలలో మూలుగుతుం టారని' ఒక అభిప్రాయం ఉంది. మరి వారిని అలా తయారు చేసిన పండిత శిఖామణులైన
అజ్ఞానుల మాటేంటి? ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ-
వరాహమిహిరుని 'బృహత్ సంహిత'(68-7)లో ఇలా ఉందని
పరిశోధకులు చెపుతున్నారు. 'పురుషుడి జననాంగం చిన్నదిగా వుంటే పిల్లలు పుట్టరు. కానీ
ధనవంతుడౌతాడు. పెద్దదిగా వుంటే పేదవాడవుతాడు. ఎడమవైపు వంగి వుంటే పిల్లలు పుట్టరు.
డబ్బూ వుండదు. కుడి వైపు వంగి వుంటే కొడుకులు పుడతారు' ఇదెంత అసంబద్ద విషయమన్నది మనమిక్కడ విశ్లేషించనక్కర్లేదు. అన్ని
దిన, వార మాస పత్రికల్లో టెలివిజన్ ఛానళ్లలో కావల్సినంత లైంగిక
విజ్ఞానం స్పెషలిస్టుల వల్ల తెలుసుకుంటున్న నేటి జనులకు, ఈ విషయమెంత అర్థరహితమైందో విడమరచి చెప్పనక్కర్లేదు. అలాగే పిల్లి
ఎదురు కాకూడదనడం, తుమ్మినప్పుడు బయలు దేరకూడద నడం, బల్లి వంటిపై పడకూడదనడం. పొద్దున్నే ఎడమ వైపు నుండి లేవకూ
డదనడం-వంటి నమ్మకాలు ఇప్పటికీ జనంలో ఉండడం విచారించదగ్గ విషయం. హాస్యాస్పదం కూడా!
హాస్యాస్పదమైన విషయాలు పాశ్చాత్య సమాజాల్లోనూ వున్నాయి. వారికి 13 నెంబరు మంచిది కాదు. అంటే 26, 52 వంటివి రెండు మూడంతలుగా
మంచివి కాకూడదు కదా! కాకి అరిస్తే చుట్టాలొస్తారని ఇక్కడ మన వాళ్లనుకుంటారు. అక్కడ
పాత్రలు తుడిచే గుడ్డ చేతిలోంచి జారి పడితే... వస్తారట! ఒక చిన్న పెట్టెలో మత
గురువు తల వెంట్రుకలు కానీ, అస్తికలు కాని ఉంచి, పూజిస్తే మేలు జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. అది మనకిక్కడ లేదు.
మన దేశంలోనే అనేక వైరుధ్యాలున్నాయి. ఒక మతం వారి పంచాంగం ప్రకారం తిధి, వార, నక్షత్రాలు బాగులేనప్పుడే మరో
మతం వారు దాన్నే పవిత్రమైన దినంగా భావించి , పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఏది ప్రామాణికం? పాశ్చాత్య దేశాల్లో మూఢ నమ్మకాలు లేవని కాదు. మన దేశంలో శాస్త్రీయ
అవగాహన అసలే పెరగడం లేదని కాదు. అయితే వాళ్లు వాటిని అధిగమించి ప్రపంచ వైజ్ఞానిక
ప్రగతికి కృషి చేశారు. చేస్తున్నారు. కానీ, మనం మన ఘనకీర్తిని చాటుకోవడం మాత్రమే ఘనంగా చేస్తున్నాం.