*వెలుగుజాడ...గురజాడ*
★★ ఈసురోమని
మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్.. అని నిస్సత్తువను చెండాడినా!
★★ డామిట్ కథ అడ్డం
తిరిగింది... అని చమక్కులు కురిపించినా!
★★ ఒపీనియన్స్ ఛేంజ్
చేసుకోకపోతే పొలిటిషన్ కాలేడోయ్... అని చలోక్తులు విసిరినా... అది గురజాడ అప్పారావుకే
చెల్లు!
తెలుగు సాహితీ రంగంలో పెను విప్లవానికి శ్రీకారం చుట్టిన గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21న విశాఖపట్నం
జిల్లా సర్వసిద్ధి రాయవరంలో జన్మించారు. విద్యాభ్యాసం, ఉద్యోగం విజయనగరం
జిల్లాతో ముడిపడ్డాయి. గురజాడ తన బాల్యం నుంచే రచనా వ్యాసంగంపై ఆసక్తి
పెంచుకున్నారు. అప్పటి సంప్రదాయ ఒరవడిలో కొట్టుకుపోకుండా సమాజానికి ఎదురీదారు.
*తెలుగు నాట సాహితీ విప్లవ ప్రకంపనలు సృష్టించిన శ్రీశ్రీ అంతటి వారే... ‘నా అడుగుజాడ
గురజాడ’ అన్నారు.*
ఆ జాడ ఎందరికి మార్గదర్శకమైందో చెప్పడానికి ఈ మాటలు చాలు. సమాజంలోని చెడును దునుమాడిన
కలం గురజాడది! అంటరానితనం, కన్యాశుల్కం, బాల్యవివాహాల వంటి అనేకానేక సామాజిక రుగ్మతలతో కుమిలిపోతున్న సమాజానికి ఆయన
సిరాచుక్క వేగుచుక్కగా మారింది. పండితులకు మాత్రమే పరిమితమై నింగిలో విహరిస్తున్న
సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన తొలి సామాజిక-విప్లవ కవి గురజాడ. *ఆయన రచించిన
కన్యాశుల్కం నాడు వీధి వీధినా నాటక రూపంలో మారుమ్రోగిపోయింది. 125 ఏళ్ల పూర్తి
చేసుకుని... నేటికీ నేటికీ రంగస్థలానికి వన్నెలు తెస్తూనే ఉంది.* ‘పుత్తడి బొమ్మ
పూర్ణమ్మ’ గేయ తరంగం మనుషుల
మెదళ్లలో దూరి ఆలోచనలు రేకెత్తించింది. ‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అంటూ కొత్త
నిర్వచనమిచ్చిన తేజోమూర్తి... ‘మంచి అన్నది మాల అయితే ఆ మాల నేనవుతా’ అని అంటరానితనంపై
కత్తిదూసిన మానవతామూర్తి గురజాడ! ఆయన రచనల్లోని పాత్రలు ఒక్కొక్కటి ఒక్కో సంచలనం.
ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి,
సౌజన్యరావులు
సమాజంలో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటారు. ‘చిన్నారి పెళ్లి కూతురు’ అంటూ నేడు
ధారావాహికలు వస్తున్నాయి కానీ, అప్పట్లోనే పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ముక్కుపచ్చలారని వయసులో
అత్తారింటికి వెళుతూ... ‘నలుగురు కూర్చుని నవ్వే చోట నాపేరు ఒకపరితలవండి’ అంటూ నర్భగర్భంగా చేసిన వ్యాఖ్య ఎంతటి
వారినైనా కంటతడి పెట్టిస్తుంది. చిన్నతనంలోనే పెళ్లి, పెళ్లయ్యాక ఇళ్లు, భర్త పోతే
వితంతువుగా ఒక మూలన పడి ఉండటం! ఇది కాదు మహిళ జీవితమని ఆయన తేల్చిచెప్పారు. మహిళలు
చదువుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ... ‘దిద్దుబాటు’ కథానికను రచించారు. ఆధునిక కథానిక రచనకు
ఆద్యుడుగా నిలిచారు.
చింతాకు చెట్టూ చిలకలతోటి ఏ మన్పించింది, అరటికాయబజ్జి, మినపప్పు బజ్జి, ఏనుగెక్కేమనం ఏ
ఊరెళదాం.. తదితర చిన్న, చిన్న గేయాలతో చిన్నారులకు ప్రియమైన తాతయ్యగా కూడా మారారు. వాడుక భాషను
విస్తృత ప్రచారంలోకి తెచ్చి, ఆ భాషలోనే రచనలు చేస్తూ పండిత పామరులను కట్టిపడేసిన గురజాడ
రచనా శైలి ఆయనను ‘నవయుగ వైతాళికుడి’గా నిలబెట్టింది. సరళమైన మాటలతో సున్నితమైన భావంతో ఈటెల్లాంటి రచనలతో అజ్ఞాన
చీకట్లను పారద్రోలిన గురజాడ అప్పారావు 1915 నవంబర్ 30న తన 53 ఏటే కన్నుమూశారు. నాటికీ, నేటికీ, మరెన్నటికీ ఆయన
తెలుగు వారి గుండెల్లో సజీవంగానే ఉన్నారు... ఉంటారు!
★★ గురజాడ 1915 లో చనిపోలేదు.
అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించారు - దేవులపల్లి కృష్ణశాస్త్రి
★★ నాదృష్టిలో
కవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ! -
శ్రీశ్రీ
👉 గురజాడ వర్ధంతి సందర్భంగా ఇంతకుముందు _ఆంధ్రజ్యోతి_ ముద్రించిన కధనంకు
యధాతథ
కాపీ పేస్ట్