భారతదేశంలో సమకాలీన పరిస్థితులు ఎలా
ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే! ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశ ప్రజలందరూ వాటి ప్రభావానికి బలి అవుతున్నవారే! మతాన్ని, రాజకీయాన్ని కలగలిపి చిక్కు ముళ్ళువేసి, సామాన్యుల జీవితాలతో ఆటలాడుకుంటున్న
వైనం మనం నిత్యం చూస్తున్నదే. అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి, బ్యాంకుల్ని దివాలా తీయించి, మొత్తానికి మొత్తంగా దేశ ఆర్థిక
వ్యవస్థను దిగజార్చిన ఘనత ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మతం, ఒకే అభిమతం ఉండాలని దేశాన్ని శాసిస్తున్న అధికార పార్టీ, దేశ ఔన్నత్యాన్ని, దేశంలోని భిన్నత్వాన్ని ముక్కలు
చేస్తోంది. కేవలం మెజారిటీ బలం చూసుకుని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించడం అమానుషం. దేశ చరిత్రలోనే ఇది
కనీ వినీ ఎరగనిది. ఇలాంటి విషయాలన్నీ అవగాహనకు రావాలంటే వైజ్ఞానిక స్పృహ అవసరం.
ఇలాంటి సమయంలో దేశ ప్రజలంతా ఏం చేయాలి? భిన్నత్వంలో ఏకత్వం సాధించి, ప్రపంచంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న
ఈ దేశం, తన అస్థిత్వాన్ని వదలుకోవాలా? ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లిన ఈ దేశం
మత సామ్రాజ్యంగా మారిపోవాలా? దేశంలోని జ్ఞాన సంపన్నులంతా తమ స్వాభిమానాన్ని వదులుకుని, అజ్ఞాన శిఖామణులకు దాసోహమనాలా? అక్షరాల్ని హత్యచేస్తూ, గొంతుల్ని నులివేస్తూ, హక్కుల్ని కాలరాస్తున్న పాశవిక చర్యల్ని
ఉపేక్షించాలా? ఏం చేయాలి? దేశ ప్రజలకు ఊపిరాడని సమయమిది. తిరోగమన
దిశలో దేశాన్ని కొని యుగాల వెనక్కి, అనాగరిక ఆదిమ సమాజంలోకి తీసుకుపోతున్న ప్రభుత్వ విధానాలను అడ్డుకోవాల్సిన
పనిలేదా? తమ ప్రభుత్వం నుంచి ఈ దేశ ప్రజలు తమని
తాము రక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. అందువల్ల, ప్రతి పౌరుడూ ఒక సైన్సు కార్యకర్తగా, ఒక హేతువాదిగా, ఒక మానవవాదిగా మారిపోవాల్సి ఉంది. వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకుని, దాన్ని జీవితంలో ఆచరిస్తూ - తనను, తన భూమిని, తన పర్యావరణాన్ని, తన అంతరిక్షాన్ని కాపాడుకోవాల్సి ఉంది.
వైజ్ఞానిక స్పృహ లేనిది ఇవేవీ సాధించలేం.
తను జీవిస్తూ ఉన్న సమాజంలో అన్ని
వ్యవస్థల్ని చక్కదిద్దుకోలేనప్పుడు మనిషి మనుగడే ప్రశ్నారన్థకమవు తుంది. వైజ్ఞానిక
స్పృహ లోపించడం వల్లనే ఆధునిక జనజీవితం దుర్భరమవుతూ వస్తోంది. కేవలం ప్రభుత్వ
విధానాల్ని విమర్శించడం వల్ల మార్పురాదు. జనులంతా వివేకవంతులై బాధ్యతతో, నిజాయితీతో, క్రమశిక్షణతో - 'బతుకుదాం - ఇతరులను బతకనిద్దాం' - అనే సూత్రంతో - మిశ్రమంగా ఏర్పడ్డ ఈ
మానవ జాతి అంతా ఒక్కటే - అనే వైజ్ఞానిక సత్యాన్ని జీర్ణించుకుని ముందుకు నడిస్తే
మంచి ఫలితాలు లభిస్తాయి. పేర్లేమిటో తెలియని కోట్లమంది దేవుళ్ళను పూజించే భారతదేశం
ఇంకా పేదరికం, అజ్ఞానంలో మగ్గిపోతోంది. నదులు, పర్వతాలు సజీవంగా ఉండి మాట్లాడతాయని, నదులకు పుష్కరాలొస్తాయని భ్రమిస్తూ
వాటికి ఇంకా పూజలు చేసే ఈ దేశంలో అవి ఎంత కలుషితమై పోతున్నాయో గమనించుకోవడం లేదు.
దీనిలో ప్రభుత్వాల భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంది. దైవత్వం కల్పించుకున్నప్పుడు
గౌరవభావంతో వాటిని శుభ్రంగా ఉంచుకోవడం ఇక్కడి పౌరులకు తెలియడం లేదు. అందుకే
చూడండి.. ఎక్కడ దైవత్వం పేరు వినబడుతుందో అక్కడ మురికి, వ్యాపారం, దగా, మోసం, డ్రగ్స్, లైంగికదాడులు, హత్యలు వగైరా సర్వసాధారణమై పోయాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఆలోచనా
విధానంలో మార్పురావాలి. మనుషలం మనుషుల్లాగ ప్రవర్తిద్దాం.. అని అనుకోగలగాలి.
మనుషుల కన్నా జంతువులే నయం అని అనుకునేట్టుగా చేయగూడదు. ప్రతిదానిలో దైవాన్ని చూడగలిగే
భారతీయులు తమకు జీవనాధారమైన గాలి, నీరు, ఆహారం లాంటి వాటిని కాలుష్యాలకు గురిచేయగూడదు. అభివృద్ధి చెందిన ఇతర
దేశాల ప్రజలకు దేనివిలువ దానికి ఇవ్వడం, దేనినెంత శుభ్రంగా ఉంచుకోవాలో దానినంత శుభ్రంగా ఉంచుకోవడం తెలుసు.
దైవం, పవిత్రత, ఆధ్యాత్మికత అని గొప్ప మాటలు.. అంటే శుష్క వచనాలు మాట్లాడే ఈ
దేశవాసులు మాత్రం గాలి, నీరు, భూమి వంటి వాటిని కాలుష్యరహితంగా ఉంచుకోలేకపోతున్నారు. పూజలు చేసిన
దేవతావిగ్రహాల్ని నోట్లోకి తోసిపడేసి, తొక్కుతున్నప్పుడు మరి వారి మనోభావాలు ఎక్కడుంటాయో, ఎటు పోతాయో తెలియదు. విదేశాలలో సముద్రపు
ఒడ్డున బీచ్‌లలో ఒక బోర్డు కనిపిస్తుంది. ''దయచేసి జంతువుల్లా ప్రవర్తించండి'' అని దాని మీద రాసి ఉంటుంది. అసలు విషయమేమిటంటే.. జంతువులు ప్లాస్టిక్, చెత్త, సీసాలు, పాతటైర్లు, శవాలు వగైరాలన్నింటిని తెచ్చి సముద్రంలో విసిరేయవు. మనుషులు మాత్రమే
విసిరేస్తుంటారు. అందుకే అక్కడ జంతువుల్లా ప్రవర్తించండి.. అని రాసి పెడతారు. ఒరే
మూర్ఖుడా కనీసం జంతువులకు ఉన్న జ్ఞానమైనా నీకు లేదేమిరా అనే హెచ్చరిక అందులో ఉంది.
ముక్కోటి ఏకాదశి అని చెప్తారు కదా? ఆ ముక్కోటి దేవీ దేవతలు ఎవరు? సామాన్యులకు తెలియకపోవచ్చు. కానీ
పంచాంగాలు సృష్టించి, కల్లబొల్లి లెక్కలేసి పండుగలు పబ్బాలు ఏర్పరిచి, వాటితో పొట్టపోసుకునే వేద పండితులకు, పూజారులకు ఆ ముక్కోటి దేవతలెవరో తెలిసి
ఉండాలి కదా? అయినా మామూలు మనిషికి వలె దేవుడికి కామ, క్రోధ, లోభ మోహాలెందుకూ? అవన్నీ ఉన్నవాడు దేవుడెలా అయ్యాడూ? అంటే తమ స్వార్థం కోసం ఒక వర్గం వారు తయారుచేసిన తంతులు కదా ఇవన్నీ? వీటిని ఇలాగే కొనసాగించడం అవసరమా? గుడ్డిగా నమ్ముతూ అనుసరించే జనం ఎందుకు
తమ వివేకాన్ని ఉపయోగించలేక పోతున్నారూ? ఎందుకు మతం మత్తులో ఊగిపోతున్నారూ? విష్ణుమూర్తి అవతారాలన్నీ కల్పితాలని హేతుబద్ధంగా నిరూపించిన
వారున్నారు. భూమి సముద్రంలో మునిగిపోతే, వరాహావతారంలో దాన్ని విష్ణుమూర్తి పైకి తెచ్చాడన్నారు కదా? అసలు సముద్రాలు ఉన్నదే భూమి మీదయితే, ఇంకా ఏ సముద్రంలో భూమి మునిగిపోయింది? వరాహం బురదలో ఉంటుంది తప్ప, సముద్ర గర్భంలోకి వెళ్ళలేదు కదా? ఇవన్నీ ప్రజల ఆలోచనా శక్తిని
నశింపజేయడానికి ప్రచారం చేసిన కట్టుకథలు మాత్రమే. దేశంలో బౌద్ధం విస్తృత ప్రచారంలో
ఉన్నప్పుడు 'స్లీపింగ్ స్టాచ్యూ ఆఫ్ బుద్దా' (నిద్రపోతున్న బుద్ధుడి) విగ్రహాన్ని
కాపీకొట్టి, శేషశయన శాయి అయిన విష్ణుమూర్తి
విగ్రహానికి రూపకల్పన జరిగిందని పరిశోధకులు తెల్చారు.
అధికారంలో ఉన్న గౌరవనీయులైన మూర్ఖులే
సామాన్యజనానికి తప్పుడు ఆలోచనలు కలిగిస్తారు. గోమూత్రంతో కేన్సర్ తగ్గుతుందంటారు.
భగవద్గీత చదివితే మధుమేహం తగ్గుతుందంటారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి అవాకులు చవాకులు
లెక్కలేనన్ని మీడియాలో కనిపిస్తున్నాయి. చిత్తశుద్ధి, నిబద్ధత లేని మీడియాది కూడా ఇందులో
పెద్దపాత్ర ఉంది. 'గోవు-మాతల్లి అది మా సంస్కృతి' అని గొప్పగా చెప్పేవారు ఒకటి ఆలోచించాలి. గోవు గోవే. ఎప్పటికీ అది
మనుషులకు తల్లికాదు. అన్ని జంతువుల్లాగా అదీ ఒక జంతువు మాత్రమే. ఎందుకంటే, ఆవు ప్రతి సంవత్సరం ఒక్కో ఆంబోతుతో
శారీరకంగా కలుస్తుంది. కడుతుంది, దూడను కంటుంది. అలా ప్రతిసారీ ఆ సమయానికి అందుబాటులో ఉన్న ఏదో ఒక
ఆంబోతుతో కలిసి దూడని కంటుంది. కొంత కాలం తర్వాత తను పుట్టిన కోడెదూడతోనే కలసి
దూడను కంటుంది. ఈ పద్దతి జంతువుల్లో ఉంది. నాగరికులైన మానవ సమూహాల్లో లేదు. అందుకే
గోవు వేరు. మనుషులకు తల్లి అయిన స్త్రీమూర్తి వేరు. గోవు పశువు మాత్రమే. పశువును
పశువులాగే చూడాలి. అభివృద్ధి చెందిన దేశాలలో పశువుల్ని పశువులుగానే చూస్తారు.
వాటిని ప్రేమగా పెంచుకోవచ్చు. శ్రద్ధగా చూసుకోవచ్చు. కానీ వాటిని కన్నతల్లితో
పోల్చగూడదు. ఆవుపాలు మంచివే కావొచ్చు. అంతమాత్రం చేత వాటికి కన్నతల్లి స్థాయి
ఇవ్వగూడదు. ఆవు తల్లయితే ఆంబోతులన్నీ మన తండ్రులా? ఇలాంటి పిచ్చి ఆలోచనల్ని ప్రచారం చేస్తున్నందుకే మృగరాయుళ్ళంతా
ఆంబోతుల్లా తయారవుతున్నారు. లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఆవులు కన్నతల్లులని
ప్రచారం చేయడం మాని, దేశంలో ఆడపిల్లలకు భద్రత కల్పించడం మేలు. కన్నతల్లిని ఒక జంతువుతో
పోల్చే ప్రబుద్ధులు మాత్రమే గోవును గోమాత అని అంటారు. కాలం మారింది. తరం మారింది.
యువతీయువకులంతా సత్యాన్వేషణ దిశగా ప్రయాణిస్తు న్నారు. గత కాలపు యదార్థాలు తెలుసు
కోవాలని తహతహ లాడుతున్నారు. కొందరెవరో కొంతకాలం బలవంతంగా అబద్ధాలు ప్రచారం చేసినా, అవి ఎంతో కాలం కొనసాగవు. ఎవరు
చెప్పేదాంట్లో హేతుబద్ధత ఉంటుందో చివరకు వారి మాటే నిలబడుతుంది.
అయినా ఈ అబద్ధాల ప్రచారం ఈనాటిది కాదు.
వేదకాలం నుంచి వస్తున్నదే. యజ్ఞయాగాల్లో జంతువుల్ని బలిఇచ్చినప్పుడు అవి ''దైవత్వాన్ని పొందుతున్నాం. దైవ మార్గంలో
స్వర్గానికి వెళుతున్నాం'' అని ఎంతో సంతోషపడతాయట. అలా అని వేదాల్లో రాసి ఉంది. యజ్ఞం చేసిన
గృహస్థుడికి తక్షణం (ఇన్‌స్టెంట్) ధనం లభిస్తుంది. ఆ తర్వాత పుణ్యలోకం
ప్రాప్తిస్తుంది - అని కూడా రాసే ఉంది. అలాగే, నరకయాతన అనుభవించిన బలిపశువు భక్తి ప్రవత్తులతో తన మాంసాన్ని దేవతలకు
సమర్పిస్తుందట? జీవకారుణ్యం గురించి మాట్లాడిన నాటి వేద
రచయితలూ, వారిని సమర్థించే నేటి పండితోత్తములు
ఎవరూ బలిపశులు అనుభవించి నరకయాతన గురించి మాత్రం మాట్లాడరు! వారి క్రూర
మనస్తత్వాన్ని దైవత్వం చాటున దాచిపెట్టుకుంటారు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే! వేల
వేల ఏండ్లుగా అబద్ధాల్లో, భ్రమల్లో బతుకులీడ్చిన మనపూర్వీకుల్ని అందుకే గుడ్డిగా, అనాగరికంగా మనం అనుసరించకూడదు. మన
ఆధునిక జీవితానికి మనమే ఒక కొత్త వైజ్ఞానిక నిర్వచనాన్ని ఇచ్చుకోవాల్సి ఉంది.
నవీనపంథా ఎంచుకోవాల్సి ఉంది.
సంస్కృతీ సంప్రదాయాల పేరుతో
మూఢనమ్మకాల్ని పెంచి పోషించే కార్యక్రమాల్ని తక్షణం మానేయడం చాలా అవసరం. ఊరికే
కలలు కంటూ కూర్చునే కాలం కాదిది. ప్రతిదాన్ని ప్రశ్నించే కాలం, ప్రశ్నకు జవాబులు వెతుక్కునే కాలం.
ఇలాంటి పనులు వైజ్ఞానిక స్పృహతో మాత్రమే సాధ్యం! ప్రశ్నల్ని ఎక్కుపెట్టనివాడు
బతికి ఉండి కూడా ప్రయోజనం లేదు. అతీత శక్తులపై ఆధారపడకుండా ప్రపంచాన్ని ఈ ఇరవై
ఒకటవ శతాబ్దంలోకి తీసుకొచ్చిన మనిషి కృషిని, ఔన్నత్యాన్ని గుర్తించుకుంటూ, వైజ్ఞానిక స్పృహే ఊపిరిగా ప్రగతి పథాన నడవాల్సి ఉంది.
*- డాక్టర్ దేవరాజు మహారాజు*
వ్యాసకర్త: సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
(నవ తెలంగాణ తెలుగు దినపత్రిక)
తేది: జనవరి 10, 2020