మా తోడల్లుడు రామారావు మణుగూరు లో ఉంటున్నాడు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. చిన్న అమ్మాయి పేరు దివ్య. కొన్నేళ్ళ క్రితం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పుడు దివ్యకు 12ఏళ్లు, ఏడో తరగతి చదువుతోంది. నేను ఒక్కడినే పేపర్ చదువుకుంటూ కూర్చుని ఉన్నాను. అప్పుడు దివ్య మెల్లగా వచ్చి నా పక్కన కూర్చుంది. నేను నవ్వుతూ "బాగా చదువుతున్నావా" అని పలకరించాను. "బాగానే చదువుతున్నాను పెదనాన్న! నాకో సందేహం అడగమంటారా" అంది. "అడుగమ్మా" అన్నాను. మనిషికి డబ్బు కు సంబంధించిన ఇబ్బందులు దేనివలన వస్తాయి? ఆ ఇంటి యజమాని తాగుబోతు అయినందువలనా? లేక ఆ ఇంటి వాస్తు బాగా లేకనా?" అని అడిగింది దివ్య. నాకు ఆశ్చర్యం, ఆనందం కలిగింది. "నువ్వే చెప్పు తల్లి" అని ఉత్సాహపరిచాను.
"ఇంటి యజమాని తాగుబోతు అయితేనే డబ్బుకు ఇబ్బందులు వస్తాయి. దానికి ఇంటి వాస్తు ఏం చేస్తుంది?" అని ప్రశ్నించింది
"ఇంతకీ నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది రా" అని అడిగాను.
"మా వీధిలో సత్యనారాయణ అంకుల్ ఉన్నాడు. ఆయన కూడా మా నాన్నతో సింగరేణి కాలరీస్ లో పని చేస్తాడు. అయితే ఆయన రోజు బాగా తాగుతాడు. ఆయన అప్పులు చేస్తాడు. అప్పులు తీర్చలేక నానా అవస్థలు పడుతుంటాడు. అసలు విషయం ఇదయితే ఎవరో ఆయనతో "నీ ఇల్లు వాస్తు బాగో లేదు. అందుకనే నీకీ కష్టాలు. వాస్తు దోషాలు పోయేట్లుగా ఇంటిలో మార్పులు చేసుకో" అని చెప్పారట. ఇంకేం ఆయన వాస్తు పండితుణ్ణి ఒకాయన్ని ఇంటికి పిలుచుక వచ్చి ఆయన చెప్పినట్లుగా మార్పులు చేయించాడు. అయినా ఆయన కష్టాలు తీరకపోగా అప్పు పెరిగింది. అయినా ఇప్పటికీ ఆయన తన కష్టాలకు కారణం వాస్తు దోషమేనని, ఇంకో పండితుణ్ణి పిలుచుకు వచ్చి ఇల్లు చూపించాలని అనుకుంటున్నాడేగానీ తన కష్టాలకు అసలు కారణం తన తాగుడు అని అర్థం చేసుకోలేకపోతున్నాడు పెదనాన్నా" అంది.
"అమ్మా! చిన్న దానివైనా చాలా శాస్త్రీయంగా ఆలోచిస్తున్నారా! నీకున్నంత శాస్త్రీయ దృక్పథం చాలామంది పెద్ద వాళ్లకు లేకపోవడమే మనదేశ దుస్థితికి కారణం రా!" అన్నాను బాధగా.
నా మాటలు తనకు అర్థమైనట్టుగా ఒక చిరునవ్వు నవ్వి ఇంట్లోకి వెళ్ళింది దివ్య.