అది వరంగల్ జిల్లా జనగాం పట్టణంలోని ఒక ప్రముఖ లాడ్జి. ఆ లాడ్జి లోని ఒక రూమ్ లో కొంత కాలం నుండి ఒక ప్రముఖ జ్యోతిష్కుడు నివాసముంటూ తన దగ్గరకు వచ్చే ప్రజలకు జ్యోతిష్యం చెబుతున్నాడు. ఒకరోజు ఒక వ్యక్తి ఆగది లోకి ప్రవేశించాడు. ఆ వ్యక్తి పెరిగిన గడ్డం, చెదిరిపోయిన జుట్టు, మాసిన బట్టలతో ఉన్నాడు. ఎంతో దిగులుగా కనిపిస్తున్నాడు. అతను జ్యోతిష్కుని ఎదురుగా కూర్చుని తన పుట్టిన తేదీ, కాలం, ప్రదేశాలున్న కాగితాన్ని ఇచ్చాడు. జ్యోతిష్కుడు దాన్ని తీవ్రంగా పరిశీలించి ఏవో లెక్కలు గణించాడు. తర్వాత వారిద్దరి మధ్య ఈ కింది సంభాషణ జరిగింది.
జ్యోతిష్కుడు: అబ్బాయ్! నీ జాతకం ఏం బాగాలేదోయ్! జాతకం ప్రకారం మీకు ఏ పని మీద మనసు
నిలవదు. అందువలన నీకు చదువు అబ్బలేదు.
వ్యక్తి:
అవును స్వామి! అందుకనే మా నాన్న నన్ను తిడుతుంటాడు.
నాకు ఉద్యోగం చేసి సంపాదనాపరుణ్ణి
కావాలని ఉంది. నేను సంపాదన పరుణ్ణి అవుతానా? అయితే ఎప్పుడు అవుతాను?
జ్యోతిష్కుడు: నీకు సంపాదన పరుడు అయ్యే
యోగం లేదబ్బాయ్! ఏవో చిల్లర పనులు చేస్తుంటావు. కొద్దిగా సంపాదిస్తావు. చేతిలో పైసా నిలవదు. అంతా ఖర్చు చేస్తావు.
వ్యక్తి:
మరి నాకు పెళ్లెప్పుడు అవుతుంది?
జ్యోతిష్కుడు: ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి అయ్యే యోగం
లేదు.
ఈ మాటలు విన్న వెంటనే ఆ వ్యక్తి రూము తలుపు వద్దకు వెళ్లి "మిత్రులారా రండి!" అని పిలిచాడు. వెంటనే బిలబిలమంటూ పది, పన్నెండు మంది వ్యక్తులు రూమ్ లోకి ప్రవేశించారు. వారిలో పోలీసులు, స్థానిక విలేకరులు, జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు ఉన్నారు. వారికి ఆ వ్యక్తి, తనకూ జ్యోతిష్కుని కి మధ్య జరిగిన సంభాషణను వివరించాడు. వారందరూ పెద్దగా నవ్వసాగారు. జ్యోతిష్కుడు జరుగుతున్న సంఘటనను పరికించసాగాడు. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. అసలు పోలీసులు కూడా ఎందుకు వచ్చారో అతనికి అంతుబట్టడం లేదు. చివరికి బయటి నుండి వచ్చిన వారిలో ఒక వ్యక్తి ఈ విషయాన్ని జ్యోతిష్కుని వివరించాడు. "స్వామి! మేమందరం నీ జ్యోతిష్య బండారాన్ని బయట పెడదామనుకున్నాం. అందుకని ఈయనను ముందుగా పంపాం. ఆయన నీవు అనుకున్నట్లు చదువు రాని వ్యక్తి కాదు. ఆయన డాక్టర్ గోపాలరెడ్డి ఎంబిబిఎస్ పైన ఎం.డి. చదివారు. ఆయన కొన్నేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టరు. నీవన్నట్లు చేతిలో డబ్బులు లేని వ్యక్తి కాదు. ఒక ఇల్లు, బ్యాంకులో డబ్బు ఉన్న వ్యక్తి. పెళ్లి కోసం ఇబ్బంది పడటం లేదు. పెళ్లి అయ్యి ఇద్దరు బిడ్డల తండ్రి. నీవు మనిషి వేషభాషలను బట్టి, వారిని అంచనా వేసి నీకు తోచినది చెబుతావని ఇప్పుడు రుజువైంది. అంతే కానీ గ్రహాలు, గ్రహణాలకు నీ జ్యోతిషానికి సంబంధమే లేదు. ఇక పోలీసులు, విలేకరులు కూడా ఎందుకు వచ్చారు అంటే నీ బండారం బయట పడ్డందుకు నీవు కోపం తెచ్చుకుని అల్లరి చేస్తావేమోనని, ఏ గొడవా లేకుండా ఉండటానికి పోలీసులను రమ్మని మేమే కోరాము. విషయం పదిమందికి చెప్పడానికి విలేకరులను కూడా పిలిచాము.
నీ జ్యోతిష్క పాండిత్యాన్ని గూర్చి ఇప్పుడు ఏమంటావు అని ముగించారు.
జ్యోతిష్కుడు తన పొట్ట కోసం ఇలాంటి
మాటలు చెబుతుంటానని, తనను క్షమించమని, క్షమిస్తే ఊరు విడిచి వెళ్లిపోతానని వారిని కోరాడు. "మోసం చేయకుండా నీతిగా బతుకు" అని వారు అతన్ని హెచ్చరించి
వెళ్ళిపోయారు. జ్యోతిష్కుడు ఆ
రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోయాడు.