'ప్రకృతిలో భాగంగానే మనిషి మనుగడ సాగిస్తున్నాడు. కాబట్టి ప్రకృతి మనిషి దేహమే. మానవజాతి అంతరించిపోకుండా ఉండాలంటే మనిషి ప్రకృతితో నిరంతరం సంభాషిస్తూ ఉండాలి. సంబంధం కలిగి ఉండాలి. మనిషి భౌతిక, మానసిక జీవితం ప్రకృతితో ముడిపడి ఉంటుందని అంటున్నామంటే ప్రకృతి తనతో తాను ముడిపడి ఉందని అర్ధం, ఎందుకంటే మనిషి ప్రకృతిలో భాగమే'. 'చేప' సారాంశం నీటిలో దాని అస్తిత్వమే. 'మంచి నీటి చేప' సారాంశం నది లోని నీరు. ఒకసారి ఆ నదిని పరిశ్రమ అవసరాల కోసం వినియోగించడం మొదలు పెట్టాక, పరిశ్రమల నుండి వెలువడే రసాయనాలతో, వ్యర్థ పదార్థాలతో, మరపడవలతో ఆ నది కలుషితం అయిన తర్వాత, లేదా ఆ నది నీటిని వేరే అవసరాల కోసం పక్కకు మళ్లించిన తర్వాత చేప అస్తిత్వానికి అవసరమైన మాధ్యమం లేకుండా పోతుంది. అంటే చేప తన అస్తిత్వాన్ని కోల్పోతుంది'.
'లండన్ లోని 45 లక్షల మంది ప్రజలు తమ విసర్జనలతో థేమ్స్ నదిని కలుషితం చేయడం మినహా చేయగలిగిందేమీ లేదు. దాని మూల్యం మాత్రం భారీగా ఉంటుంది'.
'ఒక సమాజం మొత్తంగానీ, ఒక యావత్తు దేశం గానీ, లేదా భూమిపై ఉన్న మొత్తం సమాజాలన్నీ కలుపుకున్నాగానీ వారు భూమికి యజమానులు కారు. కేవలం ఆ భూమిపై గల వనరులను వినియోగించుకోవడం, దాని ప్రయోజనాలు పొందడం మాత్రమే వారు చేయాలి. తమ తరువాతి తరాలకు ఈ భూమిని మరింత మెరుగైన స్థితిలో అప్పచెప్పడం వారి బాధ్యత.'
'భూమి-ప్రకృతితో మానవుల సంబంధాలు ఒక హేతుబద్దమైన పద్ధతిలో (సమ సమాజంలో -అను) పునఃనిర్మించబడిన తరువాత బానిసత్వ వ్యవస్థ మాదిరిగానో, భూస్వామ్య పెత్తందారీ విధానం మాదిరిగానో, వ్యక్తిగత ఆస్తి అనే అర్ధంలేని ప్రాతిపదికనో కాకుండా... మనిషికి, భూమికి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యవస్థలో భూమి సరుకుగా పరగిణించబడదు గనుక!
150 సంవత్సరాల క్రితమే మార్క్స్ వివిధ సందర్భాలలో వ్యక్తం చేసిన పై అభిప్రాయాలు ఎంత ముందుచూపుతో ఉన్నాయో చూడండి! మానవ సమాజం ప్రకృతి నుండి వేరుపడితే కలిగే హానికర పర్యవసానాల గురించి మార్క్స్ చేసిన హెచ్చరికలు సరైనవేనని నేడు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
( 'డౌన్ టు ఎర్త్' సౌజన్యంతో )