భారత ప్రథమ ప్రధాని పండిత జవహర్‌లాల్ నెహ్రూ దేశాన్ని వైజ్ఞానికంగా ముం దుకు నడిపారు. పారిశ్రామిక, వైజ్ఞానిక రంగాలలో దేశం నిర్వ హించాల్సిన పాత్ర గురించి నిరంతరం హెచ్చరి స్తూ వచ్చారు. భారతీయ సంస్కృతిలోని గొప్పతనాన్ని కీర్తిస్తూనే మూఢ భక్తిని, మూఢాచారాల్ని నిరసిం చారు. దేవుడి పేరిట జరిగే దుబారా ఖర్చును ఆయన ఎప్పుడూ సమర్థించలేదు. పైగా తీవ్రంగా నిరసిస్తూ ఉండే వారు. భూమి ఒక గ్రహమైతే, మిగి లిన ఎనిమిది గ్రహాల్ని ప్రసన్నం చేసుకోవడానికి ‘అష్టగ్రహ కూటమి’ పూజల కోసం కొన్నిటన్నుల ధాన్యాన్ని, కొన్ని గ్యాల న్ల నెయ్యిని అగ్నికి ఆహుతి చేయడం వాడుకలో ఉంది. 1962 లోనే ఈ పూజా విధానాన్ని ఆయన దుయ్యబట్టారు. దేశంలో ఆకలిచావులు నానాటికీ పెరుగుతున్న క్రమంలో దైవప్రీతి కోసం అంతటి ఖర్చును సమాజం భరించాల్సిందేనా అని! ఒక అర్థ శతాబ్దికి పైగా గడచిన తర్వాత దేశం వైజ్ఞానికంగా ఎంతో ముం దుకు పోతున్న దశలో ఇప్పటి ప్రధాని, ఆయన మంత్రివర్గ సహచరులు దేశాన్ని ఎంచక్కా ఆదిమ సమాజంలోకి నడిపి స్తున్న వైనం మనం కళ్ళారా చూస్తున్నాం.
తిరుచూరు దగ్గరలో ఒక సంప్రదాయ నంబూద్రి గ్రామం ఉంది. అక్కడ వెయ్యి సంవత్సరాలుగా ఒక హోమగుండం కా లుతూ ఉంది. ఇందులో రోజుకు మూడుసార్లు తొమ్మిది రకాల ధాన్యాన్ని ఆహుతి చేస్తారు. దానికి తగిన పాళ్ళలో నెయ్యి, కొబ్బరి కూడా జత చేస్తారు. ఇలా వెయ్యేళ్ళ నుంచి హోమం ఆరిపోకుండా ఉంచగలుగుతున్నారంటే, ప్రతి సంవత్సరం ఎం త ఖర్చు అవుతోందో ఎవరైనా లెక్కకట్టగలరా? సంవత్సరం పొడుగూతా ఇంతపెద్ద మొత్తంలో నవధాన్యాలు, నూనెలు, కొబ్బరి కాలిపోతున్నాయంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంత మంది అన్నార్తుల నోళ్ళు కొట్టబడుతున్నాయీ? ఒక్కసారి ఆలో చించి చూడండి! అలాగే అభిషేక మహోత్సవం పేరిట కొన్ని వేల లీటర్ల పాలు నదుల్లో కలుపుతున్నారు. ఇట్లా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళిచ్చే ‘శాస్త్రీయ’ వివరణ ఏమిటంటే - ‘నదు ల్లో పెరిగిపోతున్న జలకాలుష్యాన్ని తగ్గించడానికి - నీటిని శుద్ధి చేయడానికీ.’ అని! లోగడ శంకరాచార్య యోగపీఠ అధిపతి స్వామి భాస్కరానంద పరమహంస స్వయంగా దగ్గ రుండి పూజలు చేస్తూ, చేయిస్తూ, వేదపఠనం చేస్తూ యమునా నదిలో సుమారు ఇరవై ఒక్కవేల లీటర్ల పాలను నీటిపాలు చేశారు.
యమునా నదిలో కాలుష్యం తగ్గలేదు. స్వామీజీకి దేవ తలు ప్రసన్నం కాలేదు. ఇది గాలివార్త కాదని యథార్థమేనని మనకు రెండు రుజువులు ఉన్నాయి. ఒకటి - దక్కన్ హెరాల్డ్, రెండు - అలైవ్. ఈ రెండు ఇంగ్లీషు పత్రికలు పూర్తి వివ రాలతో వ్యాసాలు ప్రకటించాయి. ‘ఈ పుణ్యభూమిలో ఎంతటి మహత్కార్యాలు జరుగుతున్నాయో కదా’ - అని మనల్ని మనం వెన్ను చరుచుకోవాలన్న మాట!
యాగాల పేరిట, యజ్ఞాల పేరిట జంతుబలులు ఇవ్వడం ఎంత నేరమో సమాజానికి ఉపయోగపడే ధాన్యాన్నీ, నూనెల్నీ, పాలని ఉపయోగానికి పనికిరాకుండా వృథా చేయడం సమాజ ద్రోహమే కదా? ఇలాంటి వాటిని నెహ్రూజీ ఎంతగా నిర సించారో, ఆయన తర్వాత వచ్చిన వారు వీటిని అంతగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. మనం మతాల ప్రభావం లోంచి, మూఢ నమ్మకాల ప్రభావంలోంచి బయటపడనిదే ఒక కొత్త దిశలో ఆలోచించలేం. వ్యక్తులుగా మనం మారితేనే సంస్థలు మారతాయి. సమాజం మారుతుంది. దేశం మారుతుంది. ప్రపంచం మారుతుంది. మూఢనమ్మకాల నుంచి బయట పడడం కష్టమే కావచ్చు. కానీ అసాధ్యం కాదు. ఎవరైనా తెగించి ‘దేవుడు’ అనేది అసంగతం, అసందర్భం, అవాస్తవం. మన నిత్య జీవితంలో ఏ శక్తి ప్రభావమూ లేదు. మానవశక్తి ప్రభావం తప్ప’- అని అంటే చాలామందికి భయం తన్ను కొస్తుంది. ‘అవన్నీ మనకెందుకూ? ఓ నమస్కారం పడేసి, హారతి కళ్ళకద్దుకుంటే పోదా?’ అని తమ పలాయన వాదాన్ని ప్రవేశపెడతారు. ఇలాంటి వారికి తమ గురించి తాము ఆలో చించుకోవడం తప్పించి, సమాజం గురించిగాని, దేశం గురించి గానీ, కనీసం పక్కవాడి గురించి గానీ, ఆలోచించడానికి ఒక్క క్షణం తీరిక ఉండదు.
భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గూర్చి ఉన్న ఈ రెండు వ్యాక్యాల గురించి ఆలోచించండి. ‘వైజ్ఞానిక ధోరణిని, మానవత్వాన్ని, సత్యాన్వేషణ తత్వాన్ని, సంస్కరణ తత్వాన్ని పెంపొందింపజేయడం ప్రతి భారత పౌరుని కర్తవ్యం.’ - ఈ భావానికి విస్తృతమైన ప్రచారం ఎందుకివ్వరు? తరాల అంత రం ఎలాగూ ఉంటుంది. కాని, కొత్తతరం వారిని కొత్తదిశలో ఎందుకు ఆలోచించుకోనివ్వరు? అవే పాత పద్ధతులు, అవే ఛాందసాలు పిల్లల మీద, యువకుల మీద బలవంతంగా రుద్ది, జాతినెందుకు నిర్వీర్యం చేస్తారు? విజ్ఞులంతా కలిసి ఆలోచించు కోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి.
తమకు తాము భగవంతులమని ప్రకటించుకున్న వారి పని ఏమౌతూ ఉందో చూస్తూనే ఉన్నాం కదా? పెద్దవాళ్ళతో ఎన్నెన్ని పరిచయాలున్నా, కోట్లకొద్దీ డబ్బు మూలుగుతున్నా స్వామీజీలు, బాబాలు జైళ్ళకు వెళ్ళక తప్పడం లేదు. విభూది, స్విస్ గడియారాలు, మంగళసూత్రాల ట్రిక్కులు తేలిపోతున్నా యన్న భయంతో పుట్టపర్తి బాబా చివరి దశలో సాంఘిక కార్యకర్తగా వేషం మార్చాడన్నది మనం గ్రహించాలి! ఆయన కట్టించిన ఆసుపత్రులు మానవ ప్రయత్నాలే కాని, భగవత్ సృష్టికి ఉదాహరణలు కావు. అన్ని ఆసుపత్రులలో మాదిరిగానే ఆ ఆసుపత్రులలో కూడా వైద్య విజ్ఞాన నిపుణులే ప్రాణాల్ని నిలుపుతున్నారు. బాబాగారి చలవ వల్ల ఎవరి ప్రాణాలు నిలవలేదు. జబ్బులు నయం కాలేదు. ఆయన చేపట్టిన సాంఘిక కార్యక్రమాల్ని అభినందించవచ్చు. కాని ఒక అర్థశతా బ్దంపైగా హస్తలాఘవంతో వస్తువుల్ని సృష్టించి జనాన్ని మోసం చేస్తుంటే మన ప్రభుత్వాలేం చేశాయి? వైజ్ఞానిక సంస్థలేం చేశాయి? ఆలోచించండి?
‘శూన్యం లోంచి శూన్యం తప్ప మరేదీ రాదు’ - అన్న సూత్రం ఇప్పటిది కాదు. క్రీ.పూ. 99-55 లలోనే లుక్రీషియస్ ప్రతిపాదించాడు. కాని ఇన్నివేల యేళ్ళు గడిచినా మనం శూన్యంలోంచి ఎవరైనా, ఏదైనా... మ్యాజిక్ చేసి సృష్టిస్తే నిజమేనని నమ్ముతున్నామే! ఇలాంటి విషయాల్లో శాస్త్రవేత్తలు మౌనం వహిస్తారెందుకూ? స్వభావసిద్ధమైన ప్రకృతి సూత్రా లకు భిన్నంగా ఏదీ జరగదని జనసామాన్యానికి తెలియ జెప్పరెందుకనీ? వీరి మౌనమే ‘మానవ దేవుళ్ళ’కు ఒకరకంగా బలం చేకూర్చుతూ ఉంది. విద్యావంతులు, శాస్త్రజ్ఞులు సామా న్యుడికి అండగా నిలబడలేక పోవడం వల్లే, అతడు అయోమ యంలో కొట్టుకుపోతున్నాడు. ప్రవాహానికి ఎదురీదడానికి ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి. అదెంతో కష్టమైన పని. ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం చాలా తేలికైన పని. అందుకే ఎక్కువ మంది కళ్ళు మూసుకుని ప్రవాహంలో కొట్టుకు పోవడానికే ఇష్టపడుతున్నారు. అందుకే ఈ సమాజ స్వరూపం ఇలా ఉంది.
‘మానసిక దౌర్బల్యం గల కొంతమంది శాస్త్రవేత్తలు ప్రజల్లోకి వచ్చి - ప్రజల భావనల్ని అర్థం చేసుకుని, నిజా నిజాలేవో బహిరంగంగా చర్చించలేకపోతున్నారు. నిజానికి ఇదే వారి ముఖ్యమైన బాధ్యత!’- అని అంటారు కార్ల్ సాగన్ ( ప్రఖ్యాత హేతువాది, సైన్స్ రచయిత, వైజ్ఞానికుడు). కొత్త విషయాల్ని కనిపెట్టి, దేశాన్ని ప్రపంచ దేశాల మధ్య తలెత్తుకునేట్లు చేయగల శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు మనకు తప్పకుండా కావాలి. అయితే వారు ప్రయోగాలకే పరిమితమై పోకుండా, సామాన్యుడి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ వారికి అండగా నిలబడగలగాలి. ముందు తరాల్ని ప్రభావితం చేయ గలగాలి కూడా! తద్వారా సమాజంలో హేతుబద్ధత గణనీయంగా పెంచగలగాలి!
- రచయిత ప్రముఖ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్
9573706806