(నవంబర్ 7, సి.వి. రామన్
జయంతి సందర్భంగా)
1930లో సి.వి. రామన్‌కు
భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిన తరువాత ఇప్పటి వరకు మన దేశంలో జన్మించి, నివసిస్తున్న ఏ
ఒక్క శాస్త్రవేత్తకు నోబుల్ బహుమతి లభించకపోవడం దురదృష్టకరం. మన దేశంలో జన్మించి, విదేశాలలో
స్థిరపడ్డ హరగోవింద్ ఖురానా(1968), సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ (1983), వెంకట్రామన్
రామకృష్ణన్ (2009)
లకు మాత్రమే
సైన్స్‌రంగంలో నోబుల్ బహుమతులు లభించాయి. సత్యేంద్రనాధ్ బోస్, జి.యం. రాంచంద్రన్, ఉత్పల్, మాణిక్‌పాల్ భద్ర, మేఘనాధ్ సాహా, శంభునాధ్‌డే, హోమీ బాబా, జగదీష్ చంద్రబోస్, సి.ఎన్.ఆర్.రావు
వంటి భారతీయ శాస్త్రవేత్తలు సైన్స్ పరిశోధనా రంగంలో అంతర్జాతీయంగా
ఖ్యాతిగడించినప్పటికీ, నోబుల్ బహుమతులు పొందలేకపోయారు. 1930లో నోబెల్ బహుమతి స్వీకరించిన సందర్భంలో సీవీ
రామన్ బహుమతి ప్రదానోత్సవానికి హాజరైన సభికులకు తాను ఆవిష్కరించిన రామన్
ప్రభావాన్ని ప్రదర్శించేందుకు 'ఆల్కాహాల్'ని మాద్యమంగా ఉపయోగించారు. అనంతరం ఏర్పాటుచేసిన
కాక్‌టెయిల్ పార్టీలో 'ఆల్కాహాల్ తీసుకుంటారా'? అని రామన్‌ను విందుకు హాజరైనవారు అడుగగా 'ఇప్పటి వరకు మీరు
ఆల్కహాల్‌లో రామన్ ఎఫెక్టు చూసారు, రామన్‌పై ఆల్కహాల్ ఎఫెక్ట్ చూడాలని
కోరుకోవద్దు'
అని
చమత్కరించి పరోక్షంగా తాను మద్యానికి దూరంగా ఉంటాననే విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రశేఖర
వెంకట్రామన్ 1888 నవంబర్ 7న ఆనాటి మద్రాసు
ప్రావిన్సులోని తిరుచరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాల్ దంపతులకు జన్మించారు. ఆయన
బాల్యం నుంచే చురుకైన విద్యార్థిగా వుంటూ కేవలం 11 సంవత్సరాల వయస్సులోనే మెట్రిక్యులేషన్
పూర్తి చేశారు. చిన్నతనం నుంచే పరిశోధన రంగంపై ఆసక్తి వున్న ఆయన విద్యాభ్యాసం
అనంతరం 1907లో ఇండియన్
ఫైనాన్స్ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్ ఎకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఒకవైపు
ఉద్యోగం చేస్తూనే మరో వైపు పరిశోధనపై దృష్టి సారించారు. తన లక్ష్యసాధన కోసం
ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా
చేరారు. 1919లో 'ది ఇండియన్
అసోషియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్‌కు' గౌరవ కార్యదర్శిగా నియమితులయ్యారు. సీవీ
రామన్ కాంతిపై పరిశోధనలు చేసి 1928లో 'రామన్ ఎఫెక్టు' కనుగొన్నారు. కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్ధంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం
చెందుతుంది,
అంటే
కాంతికిరణాలలోని ఫొటాన్ కణాలు ద్రవపదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపణ చెందుతాయి.
దూరపు కొండలు,
సముద్రపు
నీరు, ఆకాశం నీలి రంగులో
ఉండటానికి గల కారణాలను రామన్ ఎఫెక్టు విశ్లేషిస్తుంది. వైద్యరంగంలో మందుల
విశ్లేషణకు,
రసాయన
పదార్థాలలోని అణువులు, పరమాణువుల పరిశీలనకు, మనం ధరించే వస్త్రాల రంగుల అధ్యయనానికి రామన్ ఎఫెక్టు దోహదపడుతుంది. ఆయన పరి
శోధనలకు 1930లో భౌతిక
శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. రామన్ ఎఫెక్టు కనుగొన్న రోజైన ఫిబ్రవరి 28ని భారత ప్రభుత్వం
'జాతీయ సైన్స్
దినోత్సవంగా'
ప్రకటించింది.
1933లో బెంగుళూరులోని
ప్రతిష్టాత్మక 'ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్'కు రామన్ డైరెక్టర్‌గా నియమించబడ్డారు. 1948లో ఆయన
బెంగుళూరులో 'రామన్ రీసెర్చ్
ఇనిస్టిట్యూట్‌ను' స్థాపించి పలు వురు యువశాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. కేవలం రూ.250తో రామన్ తన
ప్రయోగాన్ని ఆవిష్కరించడం విశేషం. 1954లో రామన్‌ని 'భారతరత్న' వరించింది. మత విశ్వాసాల ఆధారంగా విద్యాలయం
నడిపే ఒక మతసంస్థ రామన్‌ను తమ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించమని ఆహ్వానిస్తే 'స్వర్గం, నరకం, పునర్జన్మ వంటి
అశాస్త్రీయ విషయాలపై నేను మాట్లాడను' అని ఆ సంస్థ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. 'సైన్సే నా మతం' అని రామన్
స్పష్టం చేశారు. ఆయన ధ్వనిపై కూడా పలు పరిశోధనలు చేసారు. నోబెల్ బహుమతి
పొందినప్పుడు రామన్ ఒకవైపు సంతోషం వ్యక్తంచేస్తూనే మరొకవైపు 'దేశం పరాయిపాలనలో
ఉందని బహుమతి అందుకునేటప్పుడు నాదేశం తరపున, నా దేశ జాతీయజెండా లేకపోవడం నన్ను బాధిస్తుందని' రామన్ తెలిపి
దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. 'ది లైట్ ఆఫ్ ఏషియా' పుస్తకం రామన్‌పై
అమిత ప్రభావం చూపించింది. ఆత్మన్యూనతా భావాన్ని, ఓటమి భయాన్ని వీడి ధైర్యంతో ముందడుగు
వేసి పరిశోధనా రంగంలో భారత కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయంగా నిలపాలని' రామన్
విద్యార్థులకు సూచించారు.
- యం.రాంప్రదీప్
తిరువూరు
సెల్ నెం.9492712836