ప్రశ్న:మూఢనమ్మకాలు తగ్గేదెలా?
*******************************
జవాబు: విజ్ఞానశాస్త్రం ఇంత ఎదిగినా ప్రజల్లో మూఢనమ్మకాలు సడలకుండా ఉండడానికి కారణం ప్రజాసంక్షేమ ప్రభుత్వాల చేతుల్లో కాకుండా స్వార్థ ఆర్థిక ప్రయోజనాలు పొందే దోపిడి వర్గాల చేతుల్లో సైన్సు, సైన్సు ఫలితాలు ఉండడమే!
ప్రకృతి రహస్యాల్ని ఛేదించి నిజాలేమిటో, వాస్తవాలేమిటో సైన్సు తేటతెల్లం చేస్తుంది. ఆ నిజాల ఆధారంగా సాంకేతికత సిధ్దిస్తుంది. ఆ సాంకేతికతను పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలు, సేవారంగాలు మొదలైన పెట్టుబడి ఆధారిత వ్యవహారాల్లో పెట్టుబడిదారులు అన్వయించి మరింత ఎక్కువ లాభాల్ని పొందడానికి వినియోగిస్తారు. అదే సమయంలో ఆయా సంస్థల్లో పనిచేసే శ్రామికుల, కార్మికుల సంఖ్యను తగ్గించే మానవేతర స్వయం చోదిత పద్ధతుల్లో ఉత్పత్తుల్ని పెంచుతారు. తద్వారా వేతనాలు, ఖర్చులు తగ్గడం ద్వారా మార్కెట్లో ఉత్పత్తులు పెరగడం ద్వారా ద్వీగుణీకృత లాభాల్ని పెట్టుబడిదారులు దండుకుంటారు. కానీ సైన్సు తెలిపిన నిజాలు అందరికీ నిజాలే కాబట్టి, వాటి అభ్యసన ద్వారానే పెట్టుబడి దారుడికి సేవకులు సేవ చేయగలరు. కాబట్టి సైన్సు బోధన తరగతి గదుల్లో తప్పదు. కానీ సైన్సు ప్రజల్లో అలుముకున్న అవాస్తవిక విశ్వాసాల్ని నిజాలనే దివిటీల వెలుగుల్లో ప్రశ్నించడం మానదు. నాదస్వరానికి త్రాచుపాము నాట్యం చేస్తుందని ఎంత గట్టిగా ప్రజలు నమ్మినా చెవుల్లేని పాము నాదస్వరం వినడమేమిటని సైన్సు ప్రశ్నిస్తుంది. కానీ పాములకు చెవులు లేవు కాబట్టి స్వరాలు వినపడవు అన్న వాస్తవాన్ని పారిశ్రామికరణకు వాడు కొనేవారు, పాముల్ని నాట్యమాడించడానికేనంటూ నాదస్వరాల్ని తయారు చేసి మరో విధంగా కూడా లాభాల్ని పొందాలని పాకులాడేవారు రెండు వాదనల్ని ఉపయోగించుకుంటారు. నాదస్వరం పాములకు వినపడదు అనే సత్యంవల్ల పారిశ్రామికంగా లాభాలు పొందడం కన్నా 'నాదస్వరానికి పాములు నాట్యం చేస్తాయి. అనే అసత్యమే పెట్టుబడిదారుడికి అధిక లాభాల్ని, అధికారాన్ని ప్రజలపై అజమాయిషీని ఇస్తుందని తెలిస్తే తన చెప్పు చేతుల్లో సైన్సును, అధికారాన్ని రెంటీని ఉంచుకున్న దోపిడి వర్గం ఈ అసత్యానికే ఎక్కువ ప్రచారం కల్పిస్తుంది. అసలు వాస్తవాన్ని మరుగున పెడుతుంది.
ఒకవేళ ఎవరైనా ఈ అసత్య వాదనలకు ఎదురొడ్డి నట్లయితే ఆ ఆందోళన రూపాలు దోపిడీ వర్గాల దోపిడికి సవాలుగా ఉన్నట్లయితే ఆందోళనల్ని శాశ్వతంగా రూపుమాపడానికి దోపిడీ వర్గాలు ఏ మాత్రం వెనుకంజ వేయవు.
ఒకవేళ పాములకు చెవుల్లేవు కాబట్టి అవి నాదస్వరానికి నాట్యం చేయలేవు అన్న వాస్తవమే వారికి మరింత ప్రయోజనకరంగా ఉన్నట్లయితే, లేదా ఆ వాస్తవాన్ని ఎంత గింజుకున్నా కప్పి పుచ్చడానికి వీల్లేనట్లయితే దోపిడి వర్గాలు ఈ వాస్తవాలన్నీ మాకు ముందే తెలుసు. ఆనాడే మన పూర్వీకులు దీన్ని కనుగొన్నారు అంటూ మాటమారుస్తారు. ఏ గ్రంథాల్లో ముందే ఈ వాస్తవాలున్నాయని వాదిస్తారో ఆ గ్రంథాల్లో ' పాములు నాదస్వరానికి నాట్యం చేస్తాయి' అన్న అవాస్తవాల్ని ఎన్నింటినో పొట్టనిండా నింపుకుని ఉంటాయి. కాబట్టి మరో ఇతర సైన్సు వాస్తవాన్ని అడ్డుకోవడానికి ఉపకరించాలంటే ఆ గ్రంథానికి అన్ని విధాలైన నిర్హేతుక స్తోత్రాలతో, జేజేలతో బలాల్ని ఇవ్వాలి.
ఒకవేళ ఏ గ్రంథంలోనయితే ముందే చాలా సైన్సు విశేషాలున్నాయని వారు ఏ కరువు పెడతారో ఆ గ్రంథం తప్పుల తడక అని ఎవరైనా సాక్ష్యాధారాలతో ముందుకు వస్తే, ఇదుగో, మీరు మా విశ్వాసాల్ని అవమాన పరుస్తున్నారంటూ న్యాయపరమైన రక్షణ కవచంలో ముందుకు వస్తారు. ఎందుకంటే న్యాయవ్యవస్థ కూడా వారి యుక్తులు, ప్రయోజనాల కనుగుణంగానే రూపకల్పన చేయబడి ఉంటుంది.
మీరన్నట్లు నేడు సైన్సు ఎన్నో ఆవిష్కరణలు చేసింది. ఎంతోగొప్ప ప్రగతిని సాధించింది. సాంప్రదాయ వాదనల్లోని డొల్లతనాన్ని పూర్తిగా బయట పెట్టగలిగిన స్థాయికి సైన్సు సత్యాలు అవగతం అవుతున్నాయి. మూఢనమ్మకాలకు, సైన్సు సత్యాలకు మునుపెన్నడు లేనంత తీవ్రస్థాయిలో తాత్విక ఘర్షణ అంతరంగికంగా సహజంగా తలెత్తింది.
వర్షాలకు యజ్ఞాలకు సంబంధం లేదని తేటతెల్లం అయ్యింది. నక్షత్ర రాశుల రూపాలు శాశ్వతం, స్థిరం కాదనీ, అ భంగిమ మన కంటికి కనిపించే భంగిమే గానీ ఆ భంగిమ ప్రకారం నక్షత్రాలు అక్కడ ఓ తెరమీద ఉనికిలో లేవనీ, ఆకాశమంటే ఓ తెర కాదని, అక్కడ మనకు సింహరాశిగా కనిపించే పలు నక్షత్రాల మధ్య పరస్పర దూరం సగటున కొన్ని వేల కాంతి సంవత్సరాలనీ, ఆఖరికి నేడు కనిపించే ఆ భంగిమ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిదని ఆ భంగిమ మనల్ని చేరడానికి వేల సంవత్సరాలు పట్టిందనీ సైన్సు తేటతెల్లం చేసింది. కానీ జ్యోతిష్యశాస్త్రాన్ని అమలు చేసి ప్రజల కష్టాలకు కారణం పూర్వ జన్మలోను, సుఖాల ఆశలు, కష్టాల పరిష్కరాల్ని భవిష్యత్తుకు లేదా మరుజన్మకు ఆపాదిస్తేనే పాలక వర్గాల మీద ప్రజాగ్రహం తగ్గుతుందని భావించే దోపిడివర్గం సైన్సు వాస్తవాల్ని మరుగున పెట్టి పంచాంగ శ్రవణానికి, వారఫలాలకు, భాగ్యచక్రాలకు, తాయెత్తులకు, ఉంగరాలకు సాంసారిక సామాజిక కౌటుంబిక సంక్షేమాల్ని ముడిపెట్టి తాను తన బాధ్యత నుంచి ప్రక్కకు తప్పుకుంటుంది. ప్రజాసంక్షేమానికి పెట్టాల్సిన నిధుల్ని ప్రజల్లో మూఢవిశ్వాసాల పెంపుదల కోసం వినియోగిస్తుంది. సైన్సు వ్యాప్తికన్నా భక్తివ్యాప్తికి, విశ్వాసాల ఘనీభవనానికి మరింత నిధుల్ని కేటాయిస్తుంది.
ప్రజల్ని ఇలాంటి వాస్తవిక, అసంబద్ద అనాగరిక, అనారోగ్య అనాచార ఆచారాల సంకెళ్ల నుంచి విముక్తుల్ని చేయడానికి పాటుపడే సామాజిక ఉద్యమ కారుల్ని అలాగే స్వేచ్ఛగా వదిలేస్తే, ప్రజలు తమ కష్టాలకు కారణాలు వాస్తవ జగత్తులోనే ఉన్నాయని, మతాచారాల పేరిట మన ప్రభుత్వాలు, పాలక వర్గాలు మభ్యపెడుతున్నాయని గుర్తిస్తారు. అలాంటి జ్ఞానోదయం, భావప్రగతి, సమాచారం సత్యాన్వేషణ సామరస్య భావన దోపిడివర్గాల ప్రయోజనాలకు, వారికి కొమ్ముగాసే పాలక వర్గాల అధికార లాలసత్వానికి సవాలు కాబట్టి సామాజిక ఉద్యమకారుల్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిలువరించడానికి దోపిడీవర్గాలు ప్రయత్నిస్తాయి. వేలాది సంవత్సరాలుగా సాగుతున్న దాడీని కొనసాగించడమే ఆ వర్గాల సహజ లక్షణం. పైగా ప్రాచీన కాలంలో లేని సౌకర్యాలు నేడు వారి చేతుల్లో ఉన్నాయి. సైన్సు ఇచ్చిన సామాజిక మాధ్యమాల్ని ప్రజల మధ్య సామరస్యానికి సహవాసానికి వినియోగించే బదులు ఆందోళన కారుల్ని భయపెట్టడానికి, అసత్యాల ప్రచారానికి వాడుకుంటారు. నాడు దబోల్కర్ మొన్న ఫన్సారి, నిన్న కల్బుర్గి హత్యలు అందులో భాగమే!
ప్రజా సైన్సు ఉద్యమాన్ని బలోపేతం చేయడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేలా విద్యావ్యవస్థను సంస్కరించడం, మేథావి వర్గం మేల్కొల్పడం మాత్రమే ఈ అకృత్యాలకు నివారణోపాయాలు.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక