"ప్రజల కోసం సైన్స్” అనే నినాదంతో 1988 ఫిబ్రవరి 28న జనవిజ్ఞాన వేదిక ఆవిర్భవించింది. జనవిజ్ఞాన
వేదిక ఆ నినాదాన్ని ఇవ్వవలసిన ఆవశ్యకత ఏమిటి? దేశ పరిస్థితులు ఏమిటి? పరిశీలిద్దాం.. భారతదేశంలో సైన్సు అనేక విషయాల్లో
అభివృద్ధి చెందింది. అనేక సైన్స్ పరిశోధనాలయాలు వెలిశాయి. భారతీయులు సముద్రపు
లోతుల్లోను,
ఆకాశపుటంచుల్లోను
విహరించగలుగుతున్నారు. అనేక వ్యాధులను అంతం చేయగలుగుతున్నారు. ఆకాశ హర్మ్యాలు
నిర్మించగలుగుతున్నారు. నదుల జలాలకు అడ్డుకట్టలు కట్టి, బీడునేలలను సస్యశ్యామలం చేస్తున్నారు. మారుమూల
పల్లెలకు కూడా విద్యుత్ వెలుగులు అందించుచున్నారు. అయితే ఇది నాణానికి ఒకవైపు
మాత్రమే. ప్రగతికి ఒక పార్శ్యo మాత్రమే.
ప్రగతి కి సంబంధించిన రెండో వైపునకు పరిశీలిస్తే, సైన్స్ వలన పెరిగిన అభివృద్ధి కొందరిని మాత్రమే చేరింది. కోట్లాది
మంది ప్రజలకు సైన్సు ఫలాలు అందడం లేదు. ఆకాశ విహారాలు అతి కొద్ది మంది మాత్రమే
చేయగలుగుతున్నారు. సుఖవంతమైన రైలు ప్రయాణం కూడా కొద్దిమంది ధనికులకే పరిమితం. వారు
ఫస్ట్ క్లాసులో, ఏసీ
బోగీల్లో ప్రయాణిస్తుంటే, పేదవారు
జనరల్ బోగీల్లో కుక్కబడినట్లుగా ప్రయాణిస్తున్నారు. కొంతమంది గుండెకు బదులుగా
గుండెను మార్పిడి చేయించుకుని స్థాయికి వైద్యశాస్త్రం ఎదిగినా, పేదలు విరోచనాలకు కూడా వైద్యం అందక
రోజుకు కొన్ని వందల మంది ఆ వ్యాధితో మరణిన్నారని పత్రికా వార్తలు
తెలియచేస్తున్నాయి. విద్యుత్తు వెలుగులు కొద్దిమంది పెద్దల ఇళ్లలోనే
విరజిమ్ముతున్నాయి. మెజారిటీ ప్రజలకు వీధి దీపాలే గతి. ఈ పరిస్థితి దేనిని సూచిస్తోంది? సైన్సు ఫలితాలు ప్రజలందరికీ అందడం లేదని
తెలియజేస్తుంది. ఈ పరిస్థితి మారాలి. సైన్సు ఫలితాలు ప్రజలందరికీ అందాలి. ఈ
ఆశయంతోనే జన విజ్ఞాన వేదిక ఆనాడు "ప్రజల కోసం సైన్స్" అనే నినాదాన్ని ఇచ్చింది. ఆ ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తోంది. కానీ, ఈనాటి పరిస్థితి ఏమిటి?
ఈనాడు దేశంలో ఒక విచిత్ర పరిస్థితి మొదలైంది. కొంతమంది నాయకులు, పాలకులు, సైన్స్ వ్యతిరేక ప్రచారాన్ని మొదలుపెట్టారు. పైగా 'సైన్స్ అంటే అదే' అని గట్టిగా చెబుతున్నారు. కొద్దిమంది శాస్త్రవేత్తలు కూడా అదే బాటలో పోతున్నారు. ఉదాహరణకు మన ప్రధాని వినాయకుడికి ఏనుగు తల అతికించడం అనే కథ వెనుక కొన్ని లక్షల సంవత్సరాల నాడే ప్లాస్టిక్ సర్జరీ తెలుసు అనే విషయాన్ని తెలియజేస్తోందన్నారు. విచిత్రమైన అంశం ఏమిటంటే, గ్రీకు, రోమన్ పురాణ గాధలలో గుర్రం శరీరము, మనిషి తల ఉన్న దేవుడు ఉన్నాడు. పాము శరీరం, మనిషి తల ఉన్న దేవత ఉంది. అంటే కొన్నివేల సంవత్సరాల క్రితం గ్రీకులకు, రోమన్లకు ప్లాస్టిక్ సర్జరీ తెలుసునని అంగీకరిద్దామా? ఎన్ని దేశాలలో ఆ విజ్ఞానం ఎందుకు కనుమరుగైంది? ఈ ప్రశ్నలకు ఆ నాయకుల వద్ద సమాధానం లేదు. కొంతమంది శాస్త్రవేత్తలు కూడా నాన్ సైన్సును సైన్సు గా ప్రచారం చేయడం బాధాకరం. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సిలర్, శాస్త్రవేత్త అయిన నాగేశ్వరరావు మహాభారత కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీలను పుట్టించారనీ, గాంధారి నూరుగురు కొడుకులు అలా టెస్ట్ ట్యూబ్ బేబీ పరిజ్ఞానంతో, కుండలలో పుట్టబడిన వారేనని అన్నారు. అయితే ఫలదీకరణం చెందిన జీవకణాన్ని తల్లి గర్భంలో ప్రవేశపెట్టితేనే టెస్ట్ ట్యూబ్ బేబీలు పుడుతున్నారు. గాంధారి గర్భం విచ్చిత్తి అయితే, ఆ పిండ భాగాలను కుండలలో పెడితే కౌరవులు పుట్టారని మహాభారతం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీ లు సాంకేతికకు పూర్తి విరుద్ధ ప్రక్రియ జరిగింది. అయినా ఒక శాస్త్రవేత్త ఆ ప్రక్రియను బేబీ ల సాంకేతికత అని చెప్పడం నాన్ సైన్సును సైన్స్చెప్పడమే.
కాబట్టి ఈనాడు ప్రజలను సైన్స్ వైపు కాకుండా, సైన్స్ కోసం కాకుండా, నాన్ సైన్స్, నాన్సెన్స్ కోసం మళ్లించడం అనే ప్రమాదకరమైన పరిస్థితి మొదలైంది. దీన్ని నిరోధించాలి. ప్రజలను సైన్స్ వైపునకు మరలించాలి. "సైన్స్ కోసం ప్రజలు" అనే భావనను ప్రజలకు అందించాలి. అందుకే జనవిజ్ఞాన వేదిక సైన్సు దినోత్సవం రోజున ప్రజలకు “ప్రజల కోసం సైన్స్” అని మాత్రమే కాకుండా “సైన్స్ కోసం ప్రజలు” అనే నినాదాన్ని కూడా అందిస్తోంది. సైన్సును ప్రజలకు అందించడమే కాకుండా, ప్రజలను సైన్స్ కోసం మరలించే కృషిని కూడా చేపట్టింది. దేశభక్తులైన ప్రజలు ఈ నినాదాలను అందుకోవాలని జనవిజ్ఞాన వేదిక కోరుతోంది.
- కె. ఎల్. కాంతారావు,
జన విజ్ఞాన వేదిక