ఫిబ్రవరి 17, 1600 సంవత్సరం. ఇటలీలోని రోమ్ నగరం, కాంపోడి ఫియోరి కూడలి అక్కడికి ఖగోళ
సిద్ధాంత కర్త, గణిత శాస్త్రజ్ఞుడు అయిన గియార్డనో
బ్రూనోను రెక్కలు విరిచికట్టి నాలుక తీగతో చుట్టి తీసుకొచ్చారు. నాలుకకు చుట్టిన
తీగ విప్పేసి, చివరిసారి అడిగారు. ''తప్పులన్నీ ఒప్పుకో! ప్రాణభిక్ష పెడతాం!'' అన్నారు రోమన్ మత న్యాయస్థానం పెద్దలు.
బ్రూనో తల అడ్డంగా తిప్పాడు. తను ఏ తప్పు చేయలేదని నిర్భయంగా చెప్పాడు. ఏ మాత్రం
తొణకలేదు. శిక్ష అనుభవించడానికి సిద్ధం అన్నట్టుగా నిలబడ్డాడు. ''నేను చెప్పిన నిజాలు తరతరాలుగా మీ లాంటి
మూర్ఖుల్ని తొలుస్తూనే ఉంటాయి' అన్న మనో నిబ్బరం ఆయనది. మత న్యాయస్థానం అధికారులు, రాజ్యాధినేతలు అందరూ ఆత్రంగా ఎదురు
చూశారు. ఆ చివరి క్షణంలో నైనా దాసోహమంటాడేమోనని ఆశపడ్డారు. కానీ వారి ఆశ నిరాశే
అయ్యింది.
సత్యస్థాపన కోసం తను ఎలాంటి శిక్షకైనా
సిద్ధమేనన్నట్టు, వారివైపు బ్రూనో జాలిగా చూశాడు. 'ఏమిటీ విచిత్రం? గాలీ, వెలుతురూ లేని చీకటి గదిలో ఏడేండ్లు బంధించినా, రోజూ చిత్రహింసలు పెట్టినా, క్రమం తప్పకుండా మానసికంగా వేధించినా
బ్రూనోలో ఏమాత్రం మార్పు రాలేదేమి అని మతాధికారులు ఆశ్చర్యపోయారు. వారి
పైశాచికత్వానికి వారే భయపడ్డారు. అయితే ఆ పైశాచిక ప్రవృత్తిని బ్రూనోకు
అంటగట్టారు. ఇతను మనిషి కాదు, సైతానుగా మారిపోయాడు. సైతాను రక్తం భూమిమీద పడితే అరిష్టం
సంభవిస్తుంది.. అని తీర్మానించుకున్నారు. మూఢత్వంలోంచి క్రూరత్వంలోకి జారిపోయారు.
అప్పటివరకు మత విశ్వాసకులు భూమి
కేంద్రకమని, దాని చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని
విశ్వసించేవారు. అది తప్పని సూర్యుని చుట్టే భూమి తిరుగుతోందని బ్రూనో చెప్పాడు. ఈ
విషయం అంతకుమందు నికొలస్ కోపర్నికస్ (1473-1543) చెప్పిందే. దాన్ని బ్రూనో బలపరిచాడు. అంతేకాదు, ఈ భూమి లాంటి ''భూములు''
(గ్రహాలు) ఇంకా ఉన్నాయన్నాడు. ఈ విశ్వానికి ఆదీ, అంతం ఉన్నాయని మత విశ్వసకులు బోధిస్తూ
ఉంటే, అలాంటి వేమీ లేవన్నాడు బ్రూనో.
మొత్తానికి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని
ప్రచారం చేయడం క్రైస్తవ సన్యాసి అయి ఉండి.. క్రీస్తుకు, బైబిల్‌కు వ్యతిరేకంగా ప్రశ్నలు
గుప్పించడం, విమర్శించడం నాటి రోమన్ మత న్యాయస్థానం
వారికి ఆగ్రహం తెప్పించింది. మానవీయ విలువల్ని మంటగలుపుతూ ఆనాటి మత పెద్దలు
బ్రూనోకు శిక్ష విధించారు. మనిషి, మనిషిని - మనిషిగా గుర్తించక పోవడం అతి దారుణంగా చరిత్రలో
నమోదయ్యింది.
శాస్త్రవేత్త, తత్త్వవేత్త, కవి అయిన గియార్డనో బ్రూనో కాంపోడి ఫియోరి కూడలిలో నిలబెట్టారు. అది
పేద క్రైస్తవ సన్యాసులు నివసించే ప్రాంతం. మతానికి వ్యతిరేకంగా ఎవరేమి మాట్లాడినా
వారికి ఇలాంటి గతే పడుతుందని బ్రూనోకు బహిరంగంగా శిక్ష విధించారు. మొదట ఆయన
బట్టలూడదీశారు. తర్వాత నగంగా తలక్రిందులుగా వేలాడదీశారు. సజీవంగా నిప్పంటించారు.
అక్కడ ఉన్న జనం కన్నీటి పర్యంతమయ్యారు. శాసకుల దురాగతం చూసి భయకంపితులయ్యారు.
పొరపాటున వేలి చివర కాలితేనే భరించుకోలేము కదా? మరి సజీవంగా కాలిపోవడానికైనా వెనుకాడని బ్రూనో గుండె ధైర్యాన్ని ఎలా
అంచనా వేయగలం? కేవలం అభిప్రాయ బేధాలుండడం వల్ల ఒక
మనిషిని నిలువునా కాల్చేసిన దురాగతం ఆనాడు అక్కడ జరిగింది. ఒక అబద్దం నిజాన్ని
కాల్చేసింది. మతం, విజ్ఞాన శాస్త్రానికి మంటబెట్టింది. మూఢత్వం జిజ్ఞాసను చంపేసింది.
గెలిచామనుకున్న మత పెద్దలు ఆరోజు అక్కడ తాత్కాలికంగా సంతోషించి ఉండొచ్చు. కాని
మానవ చరిత్రలో వారు దోషులుగా, మూర్ఖులుగా, దుర్మార్గులుగా శాశ్వతంగా మిగిలిపోయారు.
ఇంతకూ మత న్యాయస్థానం గియార్డనో
బ్రూనోపై మోపిన అభియోగాలేమిటీ? ఏఏ కారణాల వల్ల ఆయనకు శిక్ష విధించారు?
1. కేథలిక్కుల నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు, పుస్తకాలు రాసినందుకు.
2. జీసస్ క్రీస్తును దేవుడిగా కీర్తించడాన్ని నిరసించినందుకు,
3. ఆనాటి మత బోధకుల విశ్వాసాల్ని.. ట్రినిటీ (ఈశ్వర త్రిగుణత్వవాదం)ని
బలంగా దెబ్బతీసినందుకు.
4. జీసస్ తల్లి మేరీ కన్యాత్వాన్ని ప్రశ్నించినందుకు, అంటే.. కన్య అయిన మేరీ క్రీస్తుకు
జన్మనెలా ఇచ్చిందీ.. అని అడిగినందుకు..
5. పునర్జననం ఉండదని అన్నందుకు.
6. మానవుడి ఆత్మ వేరే శరీరంలో ప్రవేశించలేదని అన్నందుకు.
7. మత బోధకులు మాయలు, మంత్రాలతో జనాన్ని మభ్యపెడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్రంగా
నిరసించినందుకు.
ఇప్పటికీ బ్రూనో ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోయా యన్నది మనం
గుర్తించుకోవాలి. క్రీ.శ. 1593-1600 మధ్య కాలంలో ఏడేండ్లు చెరసాలలో బంధించి, బ్రూనోను శిక్షించడానికి అన్ని రకాల
కారణాల్ని వెతికింది నాటి మత న్యాయస్థానం. అతను పుస్తకాలలో రాసిన విషయాల ఆధారంగా, ఆయన మాట్లాడుతున్నప్పుడు విన్నవారు
ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా కేసును బలోపేతం చేశారు. అబద్దపు కేసుల్ని గెలిపించాలంటే
చట్టాలు, న్యాయస్థానాలు ఎక్కువ శ్రమించాల్సి
ఉంటుంది. బ్రూనోకు వ్యతిరేకంగా సమకూర్చుకున్న పత్రాలు ఓసారి నోనా టవర్‌లో
గల్లంతయ్యాయి. నాటి ప్రభువుల అడుగులకు మడుగులొత్తే వారు కొందరు మరికొన్ని
సాక్ష్యాలు తెచ్చి సమర్పించారు. అంటే మూఢుల పట్టుదలను తక్కువగా అంచనా వేయగూడదని
మనమిక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది. తన తప్పిదాలను ఒప్పుకుని, క్షమాభిక్ష అర్థించవల్సిందిగా నాటి
రోమన్ మత న్యాయస్థానం బ్రూనో మీద ఎంతగానో ఒత్తిడి తెచ్చింది. అయినా స్థిర
చిత్తుడైన బ్రూనో లొంగలేదు. వారి అన్ని ప్రయత్నాలు విఫలమైనాయని గ్రహించి ఎనమిదవ
పోప్ క్లిమెంట్ మరణశిక్ష విధించాడు. ఆ రోజు జనవరి 20, 1600 సంవత్సరం. ఈ ఉత్తర్వు ఫిబ్రవరి 17 నాడు అమలులోకొచ్చింది.
పత్రికలు, మీడియా లేని రోజుల్లో విషయాలు ఉన్నదున్నట్టుగా ఎలా బయటకొచ్చాయీ? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. బ్రూనో
ఆలోచనా విధానంతో ఏకీభవించే వారు సామన్య జనంలో ఉంటారు కదా? వారు చూసింది చూసినట్టుగా ప్రపంచానికి
తెలియజేశారు. ముఖ్యంగా బ్రెస్ లౌ ప్రాంతానికి చెందిన గాస్పర్ స్కూప్ అనే అతను
అక్కడ జరిగిన సంఘటనల్ని నమోదు చేశాడు. అందులో మానవాళి సగర్వంగా తలెత్తి చెప్పుకోగల
విషయం ఒకటుంది. నాటి మత న్యాయాధీశులకు వణుకు పుట్టించే మాట గియార్డనో బ్రూనో
అన్నాడని.. గాస్పర్ స్కూప్ రాశాడు.
''మీరుపలికే ఆ వాక్యం (మరణశాసనం) నా కన్నా అది మిమ్ముల్నే ఎక్కువ
భయకంపితుల్ని చేస్తుంది'' అని నిర్భయంగా, ధైర్యంగా ప్రకటించి తన ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు బ్రూనో.
గియార్డనో (1548-17 ఫిబ్రవరి 1600) ఫిలిప్పో బ్రూనోగా ఇటలీ, నాప్లస్ రాజ్యం, నోలాలో పుట్టాడు. కవిగా, తత్త్వవేత్తగా, గణిత శాస్త్రాజ్ఞుడిగా పేరు
సంపాదించుకున్నా, ఖగోళ సిద్ధాంత కర్తగా ప్రపంచ
ప్రఖ్యాతుడయ్యాడు. ఆధునిక వైజ్ఞానిక పరికరాలు లేని రోజుల్లో, టెలిస్కోపులు, అబ్జర్వేటరీలు లేని రోజుల్లో కొన్ని
వైజ్ఞానిక విషయాలు కచ్చితంగా చెప్పగలిగాడంటే.. ఆయన ఎంతటి మేధావో మనం అంచనా
వేసుకోవాలి. చుక్కలు చాలా దూరంలో ఉన్న సూర్యుళ్ళు అని మొదట చెప్పిన వాడాయన. తరువాత
కాలంలో ఆయన చెప్పిన అంశాల్ని ఆధునిక పరిశోధనలు ధృవీకరించాయి. స్వయం ప్రకాశితాలై
ఉండి, వేడినిచ్చే కొన్ని 'సూర్యుళ్ళు' నిశ్చలంగా ఉన్నాయని, వాటి చుట్టు తిరిగేవాటినే ''భూములం'టున్నామని, అవి వెలుగునూ, వేడిని సూర్యుల నుండి స్వీకరిస్తున్నాయని బ్రూనో ప్రకటించాడు.
అసలు మొదటిసారి నక్షత్రాలను
సూర్యుళ్ళుగా గుర్తించింది బ్రూనోయేనని ఆస్ట్రో ఫిసిస్ట్ - స్టీవెన్ సోటర్
ధృవీకరించారు.
అమోఘమైన ధారణాశక్తి, గొప్ప రచనా కౌశలం గియనార్డో బ్రూనో
సొత్తు. ధృఢ చిత్తుడిగా ఉండడం, సత్యశోధన కోసం, సత్య స్థాపన కోసం ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కోగలగడం.. ఏ తరం
వారికైనా ఆయన ఆదర్శం. ఖాళీ మెదళ్ళతో కేవలం ప్రచార ఆర్భాటాలతో, అబద్దాలతో, నిజాయితీ అనే పదం ఒకటుందని కూడా
తెలుసుకోకుండా బతుకుతున్న వాళ్ళను చూస్తే జాలేస్తుంది. సత్యం ఏదో తెలిసి కూడా
దాన్ని ప్రకటించడానికి జడుసుకునే పిరికి వాళ్ళు మన సమాజం నిండా ఉన్నారు. శాస్త్ర
వైజ్ఞానిక రంగంలో కూడా ఉన్నారు. అలాంటి వారు రోజూ బ్రూనో వ్యక్తిత్వాన్ని గుర్తు
చేసుకుని, తమలో కొద్ది కొద్దిగా మార్పు
తెచ్చుకోగలిగితే సమాజాన్ని బాగుచేసిన వారవుతారు. చుట్టూ ఉన్నవారికి ఆదర్శప్రాయులు
కావడం తర్వాత, ముందు వారు తమను తాము మోసం చేసుకోకుండా
బతికితే చాలు.
వైజ్ఞానికంగా ప్రపంచం ఏమీ సాధించని రోజుల్లోనే బ్రూనోలాంటి వాళ్ళు
గట్టిగా నిలబడి మూఢ నమ్మకాల్ని నిరసించారు. ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. ఆనాటి
నుంచి ఈనాటి వరకు మతపెద్దలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ అబద్దాలని నిజాలుగా
భ్రమింప జేస్తున్నారు. జనాన్ని మూఢత్వంలో ముంచి ఉంచుతున్నారు. బ్రూనో వారసుల అవసరం
ఈనాడు కూడా ఉంది. ఇప్పటికీ భూమినే కేంద్రకంగా తీసుకుని, లెక్కలు కడుతున్న అజ్ఞాన పండితుల్ని జనం
తిరస్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. మనమిప్పుడు ఆస్ట్రాలజీ కాదు, ఆస్ట్రానమి తెలుసుకోవాలి!
ఫిబ్రవరి 17వ తేదీ ప్రపంచ ఆలోచనా సరళిని మార్చిన
బ్రూనోను గుర్తుచేయడంతో పాటు, అలాంటి మరో మహానుభావుడు ఛార్లెస్ డార్విన్‌ను కూడా గుర్తు
చేస్తుంది. ఇదే రోజు 1836లో డార్విన్ హెచ్చెమ్మెస్ బీగిల్ అనే ఓడ మీద టాస్మోనియా నుండి
బయలుదేరాడు. బ్రూనో జ్ఞాపకార్థం పదిహేడు ఫిబ్రవరిని 'సత్యాన్వేషణ దినం'గా పరిగణిస్తున్నాం!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త,
బయాలజీ ప్రొఫెసర్.