తన *మూఢ నమ్మకాలపై నా పోరాటం* పుస్తకంలో
వీరేశలింగం గారు వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలు .....
*జ్యోతిశ్శాస్త్రం:* నాకు మొదట మిక్కిలి విశ్వాసం ఉండేది.కానీ జన్మ
పత్రికలలో దీర్ఘాయుష్మంతులవుతారని చెప్పినవాళ్లు అల్పాయుష్కులవడం,ధనవంతులవుతారని చెప్పినవాళ్లు
దరిద్రులవడం. దీర్ఘసుమంగళిగా ఉంటారన్నవాళ్ళు బాలవితంతువులవడం చూశాక ఆ నమ్మకం
పోయింది.ఒక్క విషయం ఆలోచించండి.మనదేశంలో వివాహాలకు ముహూర్తాలు పెట్టుకోకుండా
వధూవరుల జాతకాలను పరీక్షించకుండా ఎవ్వరూ పెళ్లిళ్లు చెయ్యరు.మరి ఆ వివాహితులలో లక్షల కొలదీ
బాలవితంతువులెందుకవుతున్నారు ?( పే.12,13 )
*ముహూర్తాలు:* నాకు1872 వ సంవత్సరంలో కోరంగి అనే గ్రామంలోని పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా
ఉద్యోగం వచ్చింది.మంచి ముహూర్తం చూసుకుని చేరమని ఇతరులూ మావారూ నన్ను
బలవంతపెట్టారు.నేను వారిని లక్ష్యపెట్టక అమావాస్య రోజు వెళ్లి ఉద్యోగంలో చేరాను.మా
తాత గారి బంధువూ ,సముద్ర శుల్క పర్యవేక్షకుడూ( sea custom
superintendent ) అయినబలిజేపల్లి నారాయణమూర్తి గారు
అమావాస్యనాడేల బయలు దేరితివని నన్నడిగారు." ఈశ్వరుడు చేసిన దినములన్నియు సమానముగానే మంచివయినప్పుడు ఏ దినమున
బయలుదేరిన ఏమని నేను బదులు చెప్పితిని.( పే 24 )
*కీడు చెట్టు:* మా దొడ్డి లోనున్న అరటిచెట్టు చిగురున కాకుండా నడుమన
పువ్వు వచ్చి గెలవేసింది.అలా మధ్యనుండి గెలవేయడం అరిష్టమని వెంటనే చెట్టు
కొట్టేయాలని ఇరుగుపొరుగువారూ బంధువులూ వెయ్యివిధాల చెప్పారు.ఎవరెన్ని చెప్పినా
ఏమవుతుందో చూద్దామని దాన్ని అలానే ఉంచాను.కొన్నాళ్ల తరువాత కూరకోసమని కాయలూ
.దూటకోసమని చెట్టూ కొట్టేయించాను.( పే 23)
*తేనెపట్టు:* మా యింటి దూలానికి పట్టింది.అలా పట్టడం అశుభమనీ ,దానిని తీయించేసి దోషం పోవడానికి
బ్రాహ్మణులచేత శాంతి చేయించమని పదేపదే చెప్పారు.నేను చలించలేదు.ఈ బండవాడికి
చెప్పడం వృధా అని ఊరుకున్నారు.( పే .24 )
*భూత వైద్యం:* ఒక్క దయ్యా న్నైనా చూపించండని ఎందరో భూత వైద్యులను
బ్రతిమాలాను .ఎవ్వరూ చూపించలేదు.ఒకడు మాత్రం ఒక నాటి రాత్రి దూరముగా ఊరి వెలుపల
మర్రి చెట్టు వద్దకు తీసుకుపోయి " దయ్యాన్ని చూపిస్తే నువ్వు జడుసుకుంటావు " అన్నాడు."
నేను జడుసుకోను.దయచేసి చూపించు" అన్నాను." నువ్వు భయపడకపోయినా ప్రభుత్వంవల్ల నాకు చెడ్డపేరు వస్తుంది" అని చెప్పి వెళ్లి పోయాడు.ఎలాగైనా
దయ్యాలను చూడాలని నేను చాలాసార్లు స్మశానానికి వెళ్ళాను.ఉపయోగం లేక కొంతమందిని
అడిగాను." పిశాచగణములలో
పుట్టినవారికి దయ్యములు కనబడవు " అన్నారు.( పే .20,21 )