:: మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కారల్ మార్క్స్ ద్విశత జయంతి సందర్భంగా
2018లో రాసిన స్నేహ అట్ట
మీది కథ. రేపు మార్క్స్ జయంతి)
‘మారాలి .. మారాలి.. ఈ పరిస్థితి మారాలి’ అని అనుకోవటం అన్ని కాలాల్లోనూ, అన్ని తరాల్లోనూ జరిగేదే! 'ఏం మారాలో, ఎందుకు మారాలో' అన్నది కూడా అందరూ తర్కించుకునేదే! మరి ఆ మార్పు ఎలా సాధ్యం? మార్చటం ఎలాగ? అన్నదే కీలకం. ఆ కీలకమైన పనికి
తిరుగులేని ఆయుధం సంధించినవాడు - కారల్ మార్క్స్. మార్పు అవసరత గురించి, అనివార్యత గురించీ స్పష్టమైన అవగాహననీ, సిద్ధాంతాన్నీ, ప్రణాళికనూ మానవాళికి అందించిన మహనీయుడు
ఆయన. కారల్‌మార్క్స్ పుట్టి, వచ్చే మే 5 నాటికి రెండొందల ఏళ్లు. ద్విశత జయంతి ఉత్సవవేళ ఆ మానవతావాదిని, మహామేధావిని స్మరించుకుందాం.
సహస్రాబ్ది(2000) లోకి అడుగిడుతున్న వేళ ..
ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే జరిగింది. ఈ సహస్రాబ్దిలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తి
ఎవరన్నది ప్రశ్న. 'కారల్ మార్క్స్' అన్నది ప్రపంచం చెప్పిన జవాబు. దేశదేశాలపై అంతగా, అత్యంత ప్రభావవంతంగా ప్రసరించి ప్రభంజనం
సృష్టించింది మార్క్స్ సిద్ధాంతం. ఇంతవరకూ జరిగిన చరిత్రలోంచి, రకరకాల పరిణామాల్లోంచి సారాంశాన్ని
గుంజి, దానికొక శాస్త్రీయ కార్యాకారణ బంధాన్ని
నిర్వచించింది. ఈ ప్రపంచం మారకతప్పదని, అది అనివార్యమని గొంతెత్తి చెప్పింది. కొద్దికాలంలోనే ఆ సిద్ధాంతం
ఆచరణలో నిరూపితమైంది. 1917లో రష్యాలో కార్మికులు, కర్షకులు ఎర్రజెండా అండగా కదం తొక్కారు. జార్ల నిరంకుశ పాలన అంతమై, ప్రజారాజ్యం ఆవిర్భవించింది. ఆ ప్రభావం
ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని దేశాలపైనా
ప్రసరించింది. పెట్టుబడీదారీ విధానానికి భిన్నమైన మార్గం ఉందని చాటి చెప్పింది.
మార్క్స్ తాను బతికి ఉన్న కాలంలో ఈ విప్లవాలను చూడలేదు. కానీ, ఆయనకు నమ్మకంగా తెలుసు; ప్రజారాజ్యాల ఆవిర్భావం తప్పనిసరి అని.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కనిపించని
ఆర్థిక దోపిడీకి, కనిపించే అన్ని రకాల అరాచకాలకు, ఆకలిచావులకు, దారుణ దౌర్జన్యాలకు 'పెట్టుబడీదారీ వ్యవస్థే కారణం' అంటాడు మార్క్స్. ఇలాంటి అస్తవ్యస్త
అంతరాల వ్యవస్థ నుంచి విముక్తిని కోరుతోంది ఆయన సిద్ధాంతం. దోపిడీ, పీడన, దారిద్య్రమూ లేని సమతారాజ్యం ఆయన ఆకాంక్ష.
మానవతావాది, దార్శనికుడు
ప్రపంచ మానవాళి మంచిని కోరుకున్న గొప్ప
మానవతావాది కారల్ మార్క్స్. అందరిలాగానే బతికేయదలిస్తే- ఆయన చదువుకు, విజ్ఞానానికి ఎంతో సౌకర్యవంతమైన పదవులు
వచ్చి ఉండేవి.
కానీ, ఆయన అలాంటివేమీ కోరుకోలేదు. ప్రపంచంలోని అన్నార్తుల బాధను తన బాధగా
చేసుకున్నాడు. ఆ బాధలకు కారణం ఏమిటో కనుక్కొన్నాడు. దానినుంచి విముక్తికి
మార్గమేంటో వివరించాడు. తన జీవితం మొత్తం ఒక గొప్ప సిద్ధాంతాన్ని నిర్మించటానికి, గొప్ప తాత్విక భూమికను ఏర్పర్చటానికీ
అంకితం చేశాడు. ఆ కృషిలో భాగంగా ఆయన ఎదుర్కొన్న కష్టాలు అనేకం. చవిచూసిన అవమానాలు
సవాలక్ష. అయినా, వాటిని ఇంతమాత్రంగా కూడా లెక్క చేయలేదు.
అకుంఠిత దీక్షను కొంత కూడా మొక్కవోనీయలేదు. ధీర గంభీరమైన పిలుపునిచ్చాడు : 'ప్రపంచ కార్మికులారా, ఏకం కండు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్లు తప్ప.' ఇది ఎంత గొప్ప పిలుపు! ప్రపంచ చరిత్రకు
ఇదొక మూల మలుపు!
'వర్గపోరాటాల చరిత్రే ప్రపంచ చరిత్ర.' అన్న ఒకేఒక్క మాటతో తరతరాల యుద్ధాల ఆంతర్యాన్ని విప్పి చెప్పేశాడు
మార్క్స్.
ప్రజామిత్రుడు .. ప్రపంచ హితుడు
మార్క్స్ పడక కుర్చీ మేధావి కాదు.
అప్పటివరకూ ప్రచారంలో ఉన్న అన్ని సామాజిక సిద్ధాంతాలను తీవ్రంగా అధ్యయనం చేశాడు.
సమకాలీన తత్వవేత్తలతో, ఆలోచనాపరులతో, ఉద్యమకారులతో సుదీర్ఘంగా, సవివరంగా, విశ్లేషణాత్మకంగా చర్చించాడు. ప్రపంచంలో ఏ మూల పరిణామం జరిగినా- దాని
వివరాలు తెలుసుకొని, చాలా లోతైన విశ్లేషణ చేసేవాడు. 1857 భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామంపై ఆయన రాసిన పరిశీలనా వ్యాసాలు
అలాంటి విశాల దృష్టికి నిదర్శనం. దేశం ఏదైనా ప్రపంచ ప్రజలంతా ఒకటే అన్నది మార్క్స్
అవగాహన. శ్రమను దోచుకొని, దాని ఆధారంగా సంపద కూడబెట్టేది ఒక వర్గం. శ్రమనే (శారీరక లేదా
మేధోపరమైన శ్రమ) నమ్ముకొని, దానిని వేతనానికి అమ్ముకొని నష్టపోయేది మరొక వర్గం. ప్రపంచంలో
ఎక్కడైనా ఇదే విభజన ఉంటుంది. తాను శ్రామిక ప్రజల పక్షాన నిలబడ్డాడు. శ్రామికులు
ఉత్పత్తి శక్తుల మీద ఆధిపత్యం కలిగిఉంటే - ఇప్పుడున్న సమస్యలేవీ ఉండవని చెప్పాడు.
చిన్నప్పుడే స్పష్టత
గుబురు గడ్డంతో గంభీరంగా కనిపించే
మార్క్స్ నిజానికి హాస్యప్రియుడు. చాలా సరదా మనిషి. పేదరికంపై కూడా జోకులు వేసి, నవ్వుకోగలిగిన ధైర్యశాలి.
చిన్నప్పటినుంచి చదువులో మహా చురుకు. గొప్ప ఆలోచనాపరుడు. మార్క్స్ తండ్రి
హెన్రిచ్ న్యాయవాది. ప్రాచీన సాహిత్యం, తత్వశాస్త్రం బాగా చదువుకున్నాడు. ప్రగతిశీల భావాలు కలిగి ఉండేవాడు. 1818 మే 5న పుట్టిన మార్క్స్‌కి ఆ ఇంటి వాతావరణం చిన్నప్పటినుంచి బాగా
ఒంటపట్టింది. చదవటం, తార్కికంగా ఆలోచించటం, చర్చించటం అలవాటుగా మారింది. స్కూల్లో తన ఆలోచనలు మిగతా విద్యార్థుల
కన్నా భిన్నంగా ఉండేవి. స్కూలు ఫైనల్‌లో ఒకసారి 'వృత్తి ఎంపికలో ఒక యువకుడి భావాలు' పేరిట వ్యాసం రాశాడు. వృత్తి ఎంపిక అనేది స్వార్థచింతన, సొంతలాభంతో ముడిపడి ఉండకూడదని, ప్రజలందరి మేలు కోరి పనిచేయటంలో ఎంతో
తృప్తి ఉంటుందని పేర్కొన్నాడు. నూనూగు మీసాల యువకుడిలో పొద్దుపొడుస్తున్న
ప్రగతిశీల విశాల భావాలకు అదొక ఆరంభం.
తత్వశాస్త్రంపై తరగని మక్కువ
1836లో బాన్ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యలో చేరాడు. అక్కడ
న్యాయశాస్త్ర పుస్తకాల కన్నా తత్వశాస్త్రమే ఆయన్ని ఎక్కువగా ఆకర్షించింది. ప్రపంచం
నడకని, దానిలో ఇమిడి ఉన్న సూత్రాలను అర్థం
చేసుకోవటానికి; తత్వవేత్తలతో చర్చలకు ఆ అధ్యయనం ఎంతగానో
ఉపయోగపడింది. 'తత్వవేత్తలు ఈ ప్రపంచాన్ని పరిపరి
విధాలుగా నిర్వచించారు. ఇప్పుడు కావాల్సింది దానిని మార్చటం..' అనే మార్క్స్ అవగాహన కొత్త మార్పునకు
నాంది. అదే తరువాతి కాలంలో 'పెట్టుబడి' గ్రంథం ఆవిర్భావానికీ; 'కమ్యూనిస్టు ప్రణాళిక' అవతరణకూ మూలం.
ప్రేమికుడు .. కవితాహృదయుడు
మార్క్స్ చాలా గొప్ప లోతైన తాత్విక, ఆర్థిక, సామాజిక విషయాలను తన వ్యాసాలూ, పుస్తకాల నిండా రాశాడు. అయితే, ఆయన సహజంగా కవి, సాహిత్య ప్రియుడూ కావటం వల్ల- వ్యక్తీకరించే భాష హృద్యంగా ఉంటుంది.
ఆర్థిక అంశాలను చెప్పేచోట కూడా కవిత్వ భాషా పరిమళం గుబాళిస్తుంది. యుక్తవయసులో
ఉన్నప్పుడు ఆయన కూడా చిన్న పాటి కవే! న్యాయవిద్య చదూతున్నప్పుడే జెన్నీని
ప్రేమించాడు. తన మనసున ముసిరే ప్రతి భావాన్ని అందమైన కవితగా అల్లేవాడు. అలా మూడు
నోట్ పుస్తకాలు నింపేశాడు. ప్రతి పుస్తకం మొదటి పేజీలో ఒకటే నివేదన... 'ప్రియమైన జెన్నీ వెస్ట్‌ఫాలన్‌కు..' అని. జెన్నీకి ఈ ఒత్తయిన జుట్టున్న
చురుకు చూపుల కుర్రాడంటే ప్రాణానికి మించిన ఇష్టం. జెన్నీ, మార్క్స్ చెల్లెలు సోఫీ మిత్రులు. అలా
ఆ ఇంటికి వెళ్లినప్పుడే జెన్నీకీ, మార్క్స్‌కీ పరిచయం. అది ఇష్టంగా, ప్రేమగా మారటానికి ఎంతో కాలం పట్టలేదు. జెన్నీ ధనవంతుల బిడ్డ. కానీ, మార్క్స్‌లోని విజ్ఞానం, ప్రపంచం పట్ల అతడి దృక్పథం ఆమెను బాగా
ఆకర్షించాయి. చదువు రీత్యా మార్క్స్ దూరంగా ఉన్నప్పుడు జెన్నీ ఎంతో ఇష్టంగా
ఉత్తరాలు రాసేది. 'నీ ఫొటో నా కళ్లముందు ఎంతో మహాద్భుతంగా, విజేతగా కనిపిస్తుంది. నువ్వు నిరంతరం
నా కళ్లముందే ఉండాలని మనసు పరితపిస్తోంది. ఎక్కడికెళ్లినా నీ ఊహ, ఉనికీ నా వెన్నంటే ఉంటాయి. నువ్వు
ముందుకు సాగిపో. నేను నీ బాటను చదును చేసి, అడ్డంకులన్నిటినీ తొలగించగలిగితే చాలు..' జెన్నీ రాసిన ఒక ఉత్తరంలోని మాటలివి.
ఇలాంటి సున్నితమైన, ఆహ్లాదకరమైన భావాలు పరిఢవిల్లిన ప్రేమైక మనసులు ఆ ఇద్దరివీ. ప్రేమలో
పడ్డాక పెళ్లి చేసుకోటానికి ఏడేళ్ల సమయం పట్టింది.
నిషేధాలూ.. నిర్బంధాలూ
సమాజం మార్పు కోరుకునే మార్క్స్ భావాలు
పాలకులకు నచ్చలేదు. కార్మికులు, కర్షకులు ఏకం కావాలనే పిలుపులూ, రాతలూ వాళ్లకు నిద్ర పట్టనీయలేదు.
అధికారం చేతిలో ఉన్నవాడు అప్పుడేం చేస్తాడు? మార్క్స్ రచనలపై నిషేధం.. దేశం నుంచి బహిష్కరణ.. ద్వీపాంతరవాసం.
ప్రపంచమంతటా తన వాళ్లు ఉన్నారని నమ్మే మార్క్స్‌కి ఈ శిక్ష ఒక లెక్కా? ఎక్కడికి వెళ్లినా తన పని మానలేదు.
విస్తారంగా చదవటం, విస్తృతంగా రాయటం. ప్రపంచాన్ని మార్చే సిద్ధాంతానికి మరింత పదును
పెట్టటం. పాలకులు విధించే ప్రతి నిషేధాన్ని, నిర్బంధాన్నీ తన అధ్యయనానికి ఒక పాఠంగా చేసుకోవటం.
ఈ క్రమంలో మార్క్స్ కుటుంబం అనేక
కష్టాలు పడింది. కష్టం అంటే ఏంటో తెలియని జెన్నీ అనేక ఆర్థిక ఇబ్బందులు
ఎదుర్కోవాల్సి వచ్చింది. పసిబిడ్డకు పాలు కూడా ఇవ్వలేని స్థితి! ఇంటి అద్దె
కట్టకపోతే- యజమాని ఛీత్కారాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి! ఏ అర్ధరాత్రో పోలీసులు
ఇంటిపై దాడి చేసే దుశ్చర్యలు, బెదిరింపులూ.. ఇలా ఎన్నో ! అయినా, ఆమె ధైర్యం సడలలేదు. ప్రేమ తగ్గలేదు. ఆమెకు తెలుసు - మార్క్స్ అంటే
మామూలు మనిషి కాదు; మహా మనిషి. ఈ ప్రపంచాన్ని మార్చటానికి అక్షర శస్త్రాలను సిద్ధం
చేస్తున్న తపస్వి... అని. జీవితాంతం ఆ నమ్మకానికి కట్టుబడే ఉంది. మార్క్స్ రచనలను ఆమె ప్రచురణకు వీలుగా
తిరిగి రాసేది. పత్రికలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేది. ప్రచురణకర్తలతో
మాట్లాడేది. మార్క్స్ రచనా సమయం వృథా కాకుండా- అన్ని పనులూ తాను చక్కబెట్టేది.
అందుకే వారిది ఆదర్శ దాంపత్యం. జెన్నీ రాసిన ఓ లేఖ వారి హృదయబంధాన్ని
చాటిచెబుతుంది. 'చిన్న చిన్న కష్టాలు నన్ను లొంగదీశాయని
అనుకోవొద్దు. ఈ పోరాటం ఒంటిరిది కాదని నాకు బాగా తెలుసు. నా ప్రియమైన మార్క్స్ నా
దగ్గర ఉన్నంతవరకూ నేను అత్యంత అదృష్టవంతురాలిని.' అని ఆ ఉత్తరంలో పేర్కొంది.
అతడొక గొప్ప మిత్రుడు
మార్క్స్ గొప్ప స్నేహశీలి. ఫెడరిక్
ఏంగెల్స్‌తో ఆయన స్నేహం చాలా గొప్పది. అది విశ్వమానవ కల్యాణానికి దోహదపడ్డ మైత్రి.
మార్క్స్‌లోని మేధావిని, సిద్ధాంత పటిమను గుర్తించి- ఆయనకు అడుగడుగునా సహాయపడ్డాడు ఏంగెల్స్.
ఇద్దరూ గొప్ప ఆలోచనాపరులే! ఇద్దరిదీ ఒకే లక్ష్యం. అది ఈ సమాజాన్ని మార్చే
ఆయుధాన్ని ఆవిష్కరించటం. ఇద్దరూ అనేక విషయాలపై తర్జనభర్జనలు, చర్చోపచర్చలూ జరిపేవారు. ఇద్దరూ ఒక
అవగాహనకు వచ్చాకే దానిని నిర్ధారించేవారు. కొన్ని వందల, వేల ఉత్తరాలు రాసుకున్నారు ఇద్దరూ.
అన్నీ రాజకీయ, తాత్విక, సామాజిక అంశాలే! ఇద్దరూ గొప్ప అధ్యయనపరులు. గొప్ప తార్కిక వాదులు.
ఏకోన్ముఖమైన తమ లక్ష్యం దిశగా నడవటానికి 1850 దశకంలో ఇద్దరూ ఒక పనివిభజన చేసుకున్నారు. అదేమిటంటే- ఒక్కొక్కరు
ఒక్కో విషయం మీద కేంద్రీకరించి, అధ్యయనం చేయాలి. తరువాత పరస్పరం చర్చించుకొని అవగాహన పెంచుకోవాలి.
రాజకీయ అర్థశాస్త్రం, ప్రపంచ చరిత్ర, ఐరోపా దేశాల విదేశాంగ విధానంపై అధ్యయనం మార్క్స్ పని. మిలటరీ
శాస్త్రం, భాషాశాస్త్రం, జీవిశాస్త్రాలపై అధ్యయనం ఏంగెల్స్
బాధ్యత. ఒకరు రాసింది ఒకరు చదవాలి. ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం రావాలి. అప్పుడే ఆ
వ్యాసం ప్రచురణ, బయట చర్చ. ప్రపంచంలో అప్పటినుంచి
ఇప్పటివరకూ గొప్ప గొప్ప వాళ్ల వ్యక్తిగత స్నేహాలు ఎన్నయినా ఉండొచ్చు గాక! కానీ, ప్రపంచానికి మేలు చేసిన గొప్ప స్నేహం
మార్క్స్ - ఏంగెల్స్‌దే!
కడపటి రోజులు
మార్క్స్ తన పిల్లలకు, జెన్నీకి రాసిన ఉత్తరాల నిండా గొప్ప
ప్రేమ, ఆర్ధ్రత పరుచుకొని ఉంటాయి. అమ్మానాన్నల
పట్ల ఆ పిల్లలకు కూడా అంతే ప్రేమ. ఇద్దరూ కుమార్తెలూ కమ్యూనిస్టు ఉద్యమంలో
పనిచేశారు. అల్లుళ్లు కూడా ఉద్యమ నాయకులే. తమది విశ్వమంత కుటుంబం అనే భావనతో
ఉండేవారు. దీర్ఘకాలం అనేక ఒత్తిళ్లూ సమస్యలూ ఎదుర్కొన్న జెన్నీనీ, మార్క్స్‌నీ అనారోగ్యం ఆవహించింది.
క్యాపిటల్ గ్రంథ రచనకు మార్క్స్ అహర్నిశలూ శ్రమించాడు. అనారోగ్యంతో మంచం పట్టినా
రచనను విడిచిపెట్టలేదు. జెన్నీ లివర్ క్యాన్సర్ బారిన పడింది. తీవ్రమైన నొప్పిని
పంటిబిగువన అణచిపెట్టేది. ఆమె ఆఖరి రోజుల్లో మార్క్స్ మంచం దగ్గరే ఉండేవాడు.
ఆరోజుల్లోనే క్యాపిటల్ మూడో ముద్రణ పొందింది. జెన్నీ 1881 డిసెంబర్ 2న తుదిశ్వాస విడిచింది. అది మార్క్స్‌కి
కోలుకోలేని దెబ్బ. 'జెన్నీ చనిపోయినప్పుడే మార్క్స్ కూడా చనిపోయాడు..' అని వ్యాఖ్యానించాడు ఆయన ప్రియమిత్రుడు
ఏంగెల్స్. జెన్నీ - మార్క్స్‌ల గాఢానుబంధానికి ఆ వ్యాఖ్యే ఒక నిదర్శనం. ఆ
కొద్దికాలంలోనే పెద్ద కుమార్తె కూడా చనిపోయింది. ఈ విషాదాలన్నీ ఆయన్ని తీవ్ర
ఆవేదనకు గురి చేశాయి. అయితే, మాటల్లో, చర్చల్లో తనకు ఇష్టమైన తత్వ, ఆర్థిక శాస్త్రాల గురించి చర్చిస్తూనే ఉండేవాడు. పిల్లలకు తమాషా
ప్రశ్నలు వేసి .. అలరించేవారు. ఉబ్బసం, ఊపిరితిత్తుల్లో కణితి, గొంతుమంట వంటి సమస్యలు ఆయన్నీ చుట్టుముట్టాయి. మిత్రులు, చిన్న కుమార్తె, కుటుంబ శ్రేయోభిలాషి లెంచెన్ పరిచర్యలు
చేసేవారు. 1883 మార్చి 14 : ఏంగెల్స్ రోజూలాగానే పలకరించటానికి
వచ్చాడు. మార్క్స్ గదిలోకి వెళ్లాడు. ఆయన ప్రియ మిత్రుడూ, లోకబాంధవుడూ అప్పటికే తుదిశ్వాస
విడిచాడు.
ప్రపంచ కార్మికులు, శ్రామికులు దుఃఖిల్లారు. అంత దుఃఖంలోనూ
ఒక ప్రతిన పూనారు. 'మార్క్స్ మహానీయుడు ఎప్పటికీ బతికే ఉంటాడు. ఆయన అందించిన సిద్ధాంతం
ప్రపంచానికి వెలుగు బావుటా. దానిని అందుకొని ముందుకు సాగుతాం. కార్మిక కర్షక రాజ్యాన్ని
సాధిస్తాం. అదే ఆయనకు నివాళి.' అని.
నిజమే కదా .. మార్క్స్‌కి మరణం లేదు.
ఆయన శ్రామికుడి చెమటచుక్కలోని సౌందర్యం. కార్మికుడి పిడికిలిలోని చైతన్యం.
గొంతెత్తే ప్రశ్నలోని నినాదం. నేటి ఆచరణకు ఆయువుపట్టు. రేపటి నిర్మాణానికి
సైద్ధాంతిక తొలిమెట్టు.
మనవడి స్వారీకి సలాంగిరీ!
జెన్నీ - మార్క్స్‌ల ఇల్లు స్నేహితులకు
గొప్ప మజిలీ. మంచి ఆతిథ్యానికి మారు పేరు. ఎంతోమంది వస్తూ వెళుతూ ఉండేవారు. ఒకసారి
విల్‌హెల్మ్ అనే మిత్రుడు మార్క్స్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మార్క్స్
చేస్తున్న పని ఏమిటంటే- తన మనవడిని వీపు మీద ఎక్కించుకొని ఎద్దులా నడవటం. ఆ
చిన్నోడేమో- బండివాడిలా తాత మీద ఎక్కి స్వారీ చేయటం. వాడు ఊరుకే కూచొని మజా చేయటం
లేదు. విజృంభించి అరుస్తున్నాడు. తాతకు చాలా భాషలు తెలుసు కదా.. అందుకని ఇంగ్లిషు, ఫ్రెంచి, జర్మన్ భాషల్లో అరుస్తూ అదిలిస్తున్నాడు. 'గో ఆన్.. పాస్‌లైట్ .. హుర్రా..' అంటూ కదం తొక్కిస్తున్నాడు. మార్క్స్
తన చేతులు, మోకాళ్ల మీద నడుస్తూ గది అంతా
తిప్పుతున్నాడు. విల్‌హెల్మ్, ఏంగెల్స్ తెగ నవ్వుకున్నారు. తరువాత ఆ మనవడితో జాగ్రత్తగా
సంప్రదింపులు జరిపి, తాతకు విముక్తి కలిగించారట!